Sushil Mann saved Rishabh Pant: రిషబ్‌ పంత్‌ను కాపాడింది ఈ బస్‌ డ్రైవరే-sushil mann the bus driver who saved rishabh pant ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Sushil Mann The Bus Driver Who Saved Rishabh Pant

Sushil Mann saved Rishabh Pant: రిషబ్‌ పంత్‌ను కాపాడింది ఈ బస్‌ డ్రైవరే

Hari Prasad S HT Telugu
Dec 30, 2022 05:27 PM IST

Sushil Mann saved Rishabh Pant: రిషబ్‌ పంత్‌ను కాపాడింది ఓ బస్‌ డ్రైవర్‌. అతని పేరు సుశీల్‌ మాన్‌. శుక్రవారం (డిసెంబర్‌ 30) తెల్లవారుఝామున 5.22 గంటలకు పంత్‌ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.

పంత్ ప్రయాణించిన ఈ కారు పరిస్థితి చూస్తే ప్రమాద తీవ్రత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు
పంత్ ప్రయాణించిన ఈ కారు పరిస్థితి చూస్తే ప్రమాద తీవ్రత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు (PTI)

Sushil Mann saved Rishabh Pant: ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ ఘోరమైన కారు ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో కారు మొత్తం అగ్నికి ఆహుతి కాగా.. సరైన సమయంలో కారులో నుంచి బయటకు వచ్చిన పంత్‌కు కొన్ని గాయాలు మాత్రం అయ్యాయి. అయితే పంత్‌ ప్రాణాలతో బయటపడటానికి కారణం ఓ బస్‌ డ్రైవర్‌.

ఆ డ్రైవర్‌ పేరు సుశీల్‌ మాన్‌. పంత్ కారు ప్రమాదాన్ని మొదటగా చూసిన వ్యక్తి, అతనికి ఇతరులతో కలిసి సాయం చేసిన వ్యక్తి ఇతడే. శుక్రవారం ఉదయం ప్రమాదం జరిగిన సమయంలో ఏం జరిగిందో సుశీల్ వివరించాడు. తాను పంత్‌ను ఎలా కాపాడగలిగానో అతడు చెప్పుకొచ్చాడు.

"నేను హరిద్వార్‌ నుంచి ఉదయం 4.25 గంటలకు బయలుదేరాను. హైవేపై వెళ్తుండగా 300 మీటర్ల దూరంలో కాస్త వెలుతురు అటూ ఇటూ కదులుతూ కనిపించింది. అది కారు అని తెలియడానికి కొంత సమయం పట్టింది. అప్పుడే కండక్టర్‌తో ఏదో జరిగిందని చెప్పాను. అప్పటికే ప్రమాదం జరిగిపోయింది. 100 మీటర్ల సమీపానికి రాగానే హరిద్వార్‌ వైపు కారు అప్పటికే డివైడర్‌కు ఢీకొట్టింది. కారు బస్‌ వైపు రావడంతో ప్రయాణికులు భయపడ్డారు" అని సుశీల్‌ ఇండియా టుడేతో అన్నాడు.

"కారు అప్పటికే మూడు, నాలుగు పల్టీలు కొట్టి డివైడర్‌ను ఢీకొట్టింది. అప్పటికి పంత్‌ సగం కారు బయట ఉన్నాడు. నేను వెంటనే బస్‌ను ఆపి, కండక్టర్‌తో కలిసి దగ్గరికి వెళ్లాను. బస్సులోని ప్రయాణికులు కూడా మాకు సాయం చేశారు. ఒక్కడివే ఉన్నావా అని అతన్ని అడిగితే అవును అన్నాడు. అతడ స్పృహలోనే ఉన్నాడు. అప్పటికే కారుకు మంటలు అంటుకున్నాయి. కాస్త ఆలస్యమైనా పంత్‌ బతికేవాడు కాదు" అని సుశీల్ చెప్పుకొచ్చాడు.

"అప్పుడు తాను రిషబ్‌ పంత్‌నని, క్రికెటరర్‌నని చెప్పాడు. నేను క్రికెట్‌ అభిమానిని కాదు కాబట్టి అతన్ని గుర్తించలేకపోయాను. పంత్‌ను బయటకు తీసి డివైడర్‌పై పడుకోబెట్టాం. నీళ్లు అడిగితే ఇచ్చాం. ఓ ప్రయాణికుడు అతనికి దుప్పటి ఇచ్చాడు. ఓవైపు పోలీసులకు, అంబులెన్స్‌కు నేను ఫోన్‌ ప్రయత్నిస్తున్నా బిజీ వచ్చింది. కారులో మంటలు ఎక్కువ అవుతుండటం ఆందోళన కలిగించింది. అతన్ని బస్సులోకి తీసుకెళ్లి హాస్పిటల్‌లో చేర్చాలని కండక్టర్‌ చెప్పాడు. ఆలోపే పోలీసులు, అంబులెన్స్‌ వచ్చాయి" అని సుశీల్‌ చెప్పుకొచ్చాడు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్