Rishabh Pant Being Looted: రక్తమోడుతున్నా పంత్‌ డబ్బు దోచుకున్నారు.. అంబులెన్స్‌కూ తనకు తానుగా కాల్‌ చేసిన క్రికెటర్‌-rishabh pant being looted after he met with the accident called for ambulance himself ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rishabh Pant Being Looted: రక్తమోడుతున్నా పంత్‌ డబ్బు దోచుకున్నారు.. అంబులెన్స్‌కూ తనకు తానుగా కాల్‌ చేసిన క్రికెటర్‌

Rishabh Pant Being Looted: రక్తమోడుతున్నా పంత్‌ డబ్బు దోచుకున్నారు.. అంబులెన్స్‌కూ తనకు తానుగా కాల్‌ చేసిన క్రికెటర్‌

Hari Prasad S HT Telugu
Dec 30, 2022 03:12 PM IST

Rishabh Pant Being Looted: రక్తమోడుతున్నా పంత్‌ డబ్బు దోచుకున్నారు.. కనీసం అంబులెన్స్‌కూ కాల్‌ చేయకపోవడంతో.. అతడు తనకు తానుగా చేసుకోవాల్సిన దుస్థితి తలెత్తింది.

ప్రమాదంలో కాలి బూడిదైన పంత్ ప్రయాణిస్తున్న కారు
ప్రమాదంలో కాలి బూడిదైన పంత్ ప్రయాణిస్తున్న కారు (ANI)

Rishabh Pant Being Looted: మానవత్వం మంటగలిసింది. ఇండియన్‌ టీమ్‌ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ ప్రమాదానికి గురైన తర్వాత జరిగిన ఘటనలు సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నాయి. ఇంతటి ప్రమాదం నుంచి తనకుతానుగా బయటపడిన పంత్.. చివరికి అంతటి గాయాలతోనూ అంబులెన్స్‌కు తనకు తాను ఫోన్‌ చేసుకోవాల్సి వచ్చింది.

ఈ ప్రమాదం జరిగిన తర్వాత రిషబ్‌ పంత్‌ను అక్కడున్న వాళ్లు దోచుకున్నారు. అతని బ్యాగులోని డబ్బును దోచుకొని అక్కడి నుంచి పారిపోయారు. పంత్‌ రక్తమోడుతున్నా వాళ్లు కనికరించలేదు. మరొకరు వీడియో తీస్తుండగా.. అలా చేయొద్దని పంత్‌ వారించాల్సి వచ్చింది. ఈ ప్రమాదం నుంచి రిషబ్‌ పంత్‌ ప్రాణాలతో బయటపడినా.. మానవత్వం మాత్రం చచ్చిపోయిందంటూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.

చివరికి పంత్‌ అలాంటి పరిస్థితుల్లో తనకు తాను అంబులెన్స్‌కు ఫోన్‌ చేసుకున్నాడంటే అతను చాలా ధైర్యవంతుడే అంటూ ఓ యూజర్‌ ట్వీట్‌ చేశాడు. ఈ ప్రమాదం నుంచి బయట పడిన వెంటనే ముఖమంతా రక్తంతో నిండిన పంత్‌ వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ సమయంలో వీడియో తీయొద్దంటూ పంత్‌ ఆ వ్యక్తిని కోరాడు.

పంత్‌ను ఇలాంటి పరిస్థితుల్లోనూ దోచుకున్న వారిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత రక్తమోడుతున్న పంత్‌కు స్థానికులు దుప్పట్లు ఇచ్చారు. హర్యానా రోడ్‌వేస్‌ బస్‌ ఒకటి అక్కడి నుంచి వెళ్తుండగా ఆ బస్‌ డ్రైవర్‌, ఇతర సిబ్బంది పంత్‌కు సాయం చేశారు. మంటల్లో చిక్కుకున్న కారు నుంచి పంత్‌ బయటపడేలా వాళ్లు సాయం చేసినట్లు పీటీఐ రిపోర్ట్‌ వెల్లడించింది.

మొదట పంత్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లినప్పుడు అతడు పూర్తిగా స్పృహలోనే ఉన్నాడని రూర్కీలోని హాస్పిటల్‌ డాక్టర్లు చెప్పారు. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా సడెన్‌గా వెళ్లి వాళ్లను సర్‌ప్రైజ్‌ చేద్దామని పంత్‌ అనుకున్నాడని, ఈలోగా ఇలా ప్రమాదం జరిగిందని అతనికి చికిత్స చేసిన డాక్టర్‌ సుశీల్‌ నగార్‌ తెలిపారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్