తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ricky Ponting In Hospital: హాస్పిటల్‌లో రిక్కీ పాంటింగ్‌.. కామెంట్రీ ఇస్తున్న సమయంలోనే..

Ricky Ponting in Hospital: హాస్పిటల్‌లో రిక్కీ పాంటింగ్‌.. కామెంట్రీ ఇస్తున్న సమయంలోనే..

Hari Prasad S HT Telugu

02 December 2022, 16:59 IST

google News
    • Ricky Ponting in Hospital: హాస్పిటల్‌లో చేరాడు ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్‌ రిక్కీ పాంటింగ్‌. ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ తొలి టెస్ట్‌ కామెంట్రీ ఇస్తున్న సమయంలోనే అతడు అస్వస్థతకు గురయ్యాడు.
రికీ పాంటింగ్
రికీ పాంటింగ్ (AFP)

రికీ పాంటింగ్

Ricky Ponting in Hospital: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ హాస్పిటల్లో చేరాడు. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో కామెంట్రీ ఇస్తున్న సమయంలోనే అస్వస్థతకు గురి కావడంతో పాంటింగ్‌ను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. మూడో రోజు తన ఛాతీలో కాస్త అసౌకర్యంగా ఉన్నట్లు గుర్తించిన పాంటింగ్‌.. కామెంట్రీ మధ్యలోనే వదిలేసి వెళ్లాడు.

అతని ఆరోగ్యం బాగా లేదని, మూడో రోజు ఇక కామెంట్రీ ఇవ్వడని బ్రాడ్‌కాస్టింగ్‌ ఛానెల్‌ సెవెన్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు. అయితే హాస్పిటల్‌ చెకప్‌ తర్వాత పాంటింగ్‌ బాగానే ఉన్నట్లు అతని సన్నిహితులు తెలిపారు. నిజానికి ఈ ఏడాది ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజ క్రికెటర్లను కోల్పోయింది. గుండె పోటు కారణంగానే మాజీ క్రికెటర్లు రాడ్‌ మార్ష్‌, షేన్‌ వార్న్‌లు మరణించిన విషయం తెలిసిందే. అంతకుముందు డీన్‌ జోన్స్‌ కూడా ఇలాగే కన్నుమూశాడు.

దీంతో పాంటింగ్‌ కాస్త అసౌకర్యంగా అనిపించిన వెంటనే హాస్పిటల్‌కు వెళ్లాడు. అయితే అతని ఆరోగ్యం బాగానే ఉందన్న వార్తలతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. క్రికెట్‌లోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌, కెప్టెన్లలో ఒకడిగా పాంటింగ్‌కు పేరుంది.

అతడు టెస్టుల్లో 13,378 పరుగులు, వన్డేల్లో 13704 పరుగులు చేశాడు. 1995 నుంచి 2012 వరకూ ఆస్ట్రేలియా టీమ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. తన కాలంలో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ప్రధాన ప్రత్యర్థుల్లో పాంటింగ్‌ ఒకడిగా ఉండేవాడు. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో పాంటింగ్‌ 71 సెంచరీలు చేశాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లి కూడా 71 సెంచరీలతో పాంటింగ్‌ను సమం చేశాడు.

ఇక ఆస్ట్రేలియా టీమ్‌కు 77 టెస్టుల్లో పాంటింగ్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. అందులో 48 మ్యాచ్‌లలో ఆసీస్ విజయం సాధించింది. ప్రస్తుతం పాంటింగ్‌ ఐపీఎల్‌ టీమ్‌ అయిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు హెడ్‌ కోచ్‌గా ఉన్నాడు.

తదుపరి వ్యాసం