Ravindra Jadeja as Captain: గాయం నుంచి కోలుకొని రాగానే కెప్టెన్ అయిపోయిన జడేజా
23 January 2023, 10:16 IST
- Ravindra Jadeja as Captain: గాయం నుంచి కోలుకొని రాగానే కెప్టెన్ అయిపోయాడు రవీంద్ర జడేజా. రంజీ ట్రోఫీలో తమిళనాడుతో జరగనున్న మ్యాచ్ లో సౌరాష్ట్ర టీమ్ ను అతడు లీడ్ చేయనున్నాడు.
రవీంద్ర జడేజా
Ravindra Jadeja as Captain: టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయం నుంచి కోలుకొని మళ్లీ క్రికెట్ లో అడుగుపెట్టబోతున్నాడు. నేషనల్ టీమ్ లోకి వచ్చే ముందు అతడు రంజీ ట్రోఫీలో ఆడనున్నాడు. అంతేకాదు వచ్చీ రాగానే కెప్టెన్ కూడా అయిపోయాడు. మంగళవారం (జనవరి 24) నుంచి తమిళనాడుతో జరగబోయే మ్యాచ్ కోసం సౌరాష్ట్ర టీమ్ కు జడేజా కెప్టెన్ గా ఉండనున్నాడు.
సౌరాష్ట్ర కెప్టెన్ జైదేవ్ ఉనద్కట్ ఈ మ్యాచ్ ఆడటం లేదు. దీంతో జడేజాను కెప్టెన్సీ వరించినట్లు స్పోర్ట్స్ స్టార్ వెల్లడించింది. ఈ మ్యాచ్ కోసం జడేజా ఇప్పటికే తన సెకండ్ హోమ్ చెన్నైలో అడుగుపెట్టాడు. ఆదివారం సాయంత్రం వనక్కం చెన్నై అంటూ జడ్డూ ఓ ట్వీట్ చేయగా.. అది వైరల్ అయింది. ఐపీఎల్లో జడేజా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కు ఆడతాడన్న విషయం తెలిసిందే.
దీంతో చెన్నై జడేజా సెకండ్ హోమ్ గా మారిపోయింది. అదే నగరంలో ఇప్పుడు జడేజా తన కమ్ బ్యాక్ మ్యాచ్ ఆడుతుండటంతోపాటు కెప్టెన్సీ కూడా చేపట్టనున్నాడు. ఇక 2019-20 రంజీ ఛాంపియన్స్ అయిన సౌరాష్ట్ర టీమ్ మంగళవారం నుంచి తమిళనాడుతో తమ చివరి రౌండ్ మ్యాచ్ ఆడబోతోంది. ఈ మ్యాచ్ కు ఉనద్కట్ తోపాటు పుజారాకు కూడా విశ్రాంతి ఇచ్చారు.
గతేడాది ఆగస్ట్ లో మోకాలి గాయం కారణంగా క్రికెట్ కు దూరమైన జడేజా మళ్లీ ఇన్నాళ్లకు కాంపిటీటివ్ క్రికెట్ లో అడుగుపెట్టబోతున్నాడు. అంతేకాదు 2018 నవంబర్ తర్వాత జడేజా ఆడుతున్న తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్ కూడా ఇదే. అతడు ఆస్ట్రేలియాతో వచ్చే నెల నుంచి జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి కూడా ఎంపికయ్యాడు. ఆ సిరీస్ కు ముందు ఈ రంజీ ట్రోఫీ మ్యాచ్ జడేజాకు ఎంతగానో ఉపయోగపడనుంది.
మరోవైపు ఈ రంజీ ట్రోఫీ సీజన్ లో తమ గ్రూప్ లో సౌరాష్ట్ర 26 పాయింట్లతో టాప్ లో ఉంది. అయితే సొంతగడ్డపై ఆంధ్రాతో జరిగిన తమ చివరి మ్యాచ్ లో 150 పరుగుల తేడాతో ఓడిపోయింది. గ్రూప్ టాపర్ కావడంతో ఇప్పటికే క్వార్టర్స్ లో సౌరాష్ట్ర అడుగుపెట్టినట్లే.