Vijay Hazare Trophy: షెల్డన్ జాక్సన్ సెంచరీ.. విజయ్ హజారే ట్రోఫీ సౌరాష్ట్ర సొంతం
Vijay Hazare Trophy: షెల్డన్ జాక్సన్ సెంచరీ చేయడంతో విజయ్ హజారే ట్రోఫీ సౌరాష్ట్ర సొంతమైంది. శుక్రవారం (డిసెంబర్ 2) మహారాష్ట్రతో జరిగిన ఫైనల్లో మహారాష్ట్రపై సౌరాష్ట్ర విజయం సాధించింది.
Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీ విజేతగా సౌరాష్ట్ర నిలిచింది. ఫైనల్లో మహారాష్ట్రను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన సౌరాష్ట్ర 2008 తర్వాత మరోసారి ఈ ట్రోఫీని సొంతం చేసుకుంది. మహారాష్ట్ర బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ వరుసగా మూడో సెంచరీ చేసినా కూడా తన టీమ్‌ను మాత్రం గెలిపించలేకపోయాడు. 249 రన్స్ టార్గెట్‌ను సౌరాష్ట్ర మరో 3.3 ఓవర్లు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది.
ఓపెనర్ షెల్డన్ జాక్సన్ 136 బాల్స్‌లో 133 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. మరో ఓపెనర్ హార్విక్ దేశాయ్ 50 రన్స్ చేశాడు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 125 రన్స్ జోడించారు. హార్విక్ తర్వాత వచ్చిన జై గోహిల్, సమర్థ్ వ్యాస్, అర్పిత్ వసదవా, ప్రేరక్ మన్కడ్ విఫలమైనా కూడా షెల్డన్ మాత్రం చివరి వరకూ క్రీజులో ఉండి సౌరాష్ట్రను గెలిపించాడు.
అంతకుముందు మహారాష్ట్ర 50 ఓవర్లలో 9 వికెట్లకు 248 రన్స్ చేసింది. మరోసారి ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 108 రన్స్ చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో అది ఇతనికి వరుసగా మూడో సెంచరీ కాగా.. ఐదు మ్యాచ్‌లలో నాలుగోది కావడం విశేషం. ఈ ట్రోఫీలోనే అతడు లిస్ట్ ఎ క్రికెట్‌లో ఒకే ఓవర్లో ఏడు సిక్స్‌లతో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
తన అద్భుతమైన ఫామ్‌ను ఫైనల్లోనూ రుతురాజ్ కొనసాగించాడు. 131 బాల్స్‌లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 108 రన్స్ చేశాడు. అతని తర్వాత అజీమ్ కాజీ 37 రన్స్‌తో రెండో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రుతురాజ్ సెంచరీ చేసినా మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో మహారాష్ట్ర భారీ స్కోరు చేయలేకపోయింది. తర్వాత చేజింగ్‌లో సౌరాష్ట్ర ధాటిగా ఆడింది.
ఓపెనర్లు షెల్డన్ జాక్సన్, హార్విక్ దేశాయ్ 26.4 ఓవర్లలో 125 రన్స్ జోడించారు. అయితే అదే స్కోరు దగ్గర హార్విక్, తర్వాత వచ్చిన జై ఔటవడంతో సౌరాష్ట్ర కష్టాల్లో పడినట్లు కనిపించింది. కానీ షెల్డన్ చివరి వరకూ క్రీజులో ఉండి తన టీమ్‌కు అద్భుతమైన విజయాన్ని సాధించి పెట్టాడు.
టాపిక్