Jaydev Unadkat first test wicket: 12 ఏళ్ల 6 రోజులు, 179 బాల్స్ తర్వాత తొలి టెస్ట్ వికెట్ అందుకున్న జైదేవ్ ఉనద్కట్
Jaydev Unadkat first test wicket: 12 ఏళ్ల 6 రోజులు, 179 బాల్స్ తర్వాత టీమిండియా పేస్ బౌలర్ జైదేవ్ ఉనద్కట్ తన తొలి టెస్ట్ వికెట్ అందుకున్నాడు. దీంతోపాటు మరో వింత రికార్డును కూడా తన పేరిట రాసుకున్నాడు.
Jaydev Unadkat first test wicket: టీమిండియా పేస్ బౌలర్ జైదేవ్ ఉనద్కట్.. అనూహ్యంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌కు తుది జట్టులోకి వచ్చాడు. తొలి మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన కుల్దీప్ యాదవ్‌ను పక్కన పెట్టి మరీ జైదేవ్‌ను తీసుకున్నారు. దీనిపై ఓవైపు విమర్శలు వెల్లువెత్తుతుండగా.. మరోవైపు జైదేవ్ ఓ వింత రికార్డును తన పేరిట రాసుకున్నాడు.
అతడు 12 ఏళ్ల 6 రోజులు, 179 బాల్స్ వేసిన తర్వాత టెస్టుల్లో తన తొలి వికెట్ తీసుకోవడం విశేషం. ఎప్పుడో 2010, డిసెంబర్ 16న సౌతాఫ్రికాపై సెంచూరియన్‌లో జరిగిన టెస్ట్‌లో జైదేవ్ ఇండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో 26 ఓవర్లు వేసినా ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు డిసెంబర్ 22, 2022లో బంగ్లాదేశ్‌పై తన రెండో టెస్ట్ ఆడాడు.
అంటే తొలి టెస్ట్ ఆడిన తర్వాత రెండో టెస్ట్ ఆడటానికి జైదేవ్‌కు 12 ఏళ్ల 6 రోజుల సమయం పట్టింది. ఇండియా తరఫున ఓ ప్లేయర్ ఒక టెస్ట్ నుంచి మరో టెస్ట్ ఆడటానికి తీసుకున్న అత్యధిక రోజుల సమయం ఇదే కావడం విశేషం. ఇన్నాళ్లూ ఈ రికార్డు దినేష్ కార్తీక్ పేరిట ఉండేది. కార్తీక్ ఒక టెస్ట్ ఆడిన తర్వాత మరో అవకాశం దక్కేలోపు ఇండియా 87 టెస్టులు ఆడింది.
ఇప్పుడు జైదేవ్‌కి అది 118 టెస్టులుగా ఉంది. ఓవరాల్‌గా ప్రపంచంలో చూసుకుంటే ఇది రెండో అత్యధికం అవుతుంది. ఇంగ్లండ్‌కు చెందిన గ్యారెత్ బ్యాటీ ఒక టెస్ట్‌కు మరో టెస్ట్‌కు మధ్య 142 టెస్టుల పాటు వేచి చూడాల్సి వచ్చింది. అతని తర్వాతి స్థానం జైదేవ్ ఉనద్కట్‌దే. ఏకంగా 12 ఏళ్ల 6 రోజుల తర్వాత అతనికి రెండో టెస్ట్ ఆడే అవకాశం రాగా.. ఈ మ్యాచ్‌లో తాను వేసిన నాలుగో ఓవర్లో బంగ్లా ఓపెనర్ జాకిర్ హుస్సేన్ వికెట్ తీశాడు జైదేవ్.
అంతకుముందు 2010లో తాను సౌతాఫ్రికాతో ఆడిన తొలి టెస్ట్‌లో 26 ఓవర్లు వేసినా వికెట్ దక్కలేదు. ఇక ఇప్పుడు నాలుగో ఓవర్ ఐదో బంతికి వికెట్ తీయడంతో టెస్టుల్లో 179 బాల్స్ వేసిన తర్వాత తొలి వికెట్ దక్కించుకోగలిగాడు. సౌరాష్ట్ర తరఫున దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణించిన జైదేవ్‌కు నేషనల్ టీమ్ నుంచి పిలుపు వచ్చింది. 2019-20 రంజీ సీజన్‌లో సౌరాష్ట్ర తరఫున కేవలం 16 ఇన్నింగ్స్‌లోనే 67 వికెట్లు తీసుకున్నాడు.