IPL 2022 | అశ్విన్ రిటైర్డ్ ఔట్...ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి…
11 April 2022, 7:56 IST
ఐపీఎల్ హిస్టరీలోనే రిటైర్డ్ ఔట్ అయిన తొలి ఆటగాడిగా నిలిచాడు. లక్నో సూపర్ జెయింట్స్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో అశ్విన్ రిటైర్డ్ ఔట్ గా కావడం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
రవిచంద్రన్ అశ్విన్
ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్డ్ ఔట్ వెనుదిరిగాడు. ఐపీఎల్ చరిత్రలోనే రిటైర్డ్ ఔట్ అయిన తొలిబ్యాట్స్‌మెన్‌గా అశ్విన్ నిలిచాడు. రాజస్థాన్ ఇన్నింగ్స్ 19వ ఓవర్ లో అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అప్పటికి 23 బంతుల్లో 28 పరుగులతో అశ్విన్ దూకుడుగా ఆడుతున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా అశ్విన్ క్రీజు వదిలి వెళ్లిపోవడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. రిటైర్డ్ ఔట్ గా అశ్విన్ పెవిలియన్ కు వెళ్లిపోవడంతో అతడి స్థానంలో రియాన్ పరాగ్ బ్యాటింగ్ దిగాడు.
చివరి ఓవర్ లో భారీ షాట్స్ కొట్టి టీమ్ స్కోరు పెంచాలనే టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయం తోనే అశ్విన్ రిటైర్డ్ ఔట్ అయినట్లుగా సమాచారం. రిటైర్డ్ ఔట్ అయిన ఆటగాడికి మళ్లీ బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉండదు. అశ్విన్ నిర్ణయం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అతడి రిటైర్డ్ ఔట్‌పై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సమర్థిస్తుండగా మరికొందరు మాత్రం ఆటగాడి ప్రతిభను తక్కువ చేయడమే నని విమర్శిస్తున్నారు.
అశ్విన్ రిటైర్డ్ ఔట్ అయినా ఆటగాడిగా మాత్రం తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాడని రాజస్థాన్ రాయల్స్ టీమ్ పేర్కొన్నది. రిటైర్డ్ ఔట్ అన్నది చక్కటి వ్యూహమే అయినా ఇలాంటివి టీ20 క్రికెట్ మనుగడను పునరాలోచనలో పడేలా చేస్తాయని వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ ఇయాన్ బిషప్ అన్నారు. రిటైర్డ్ ఔట్.. లవ్ ఇట్ అంటూ ఇంగ్లాండ్ మాజీ సారథి మైఖేల్ వాన్ పేర్కొన్నారు. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ మూడు పరుగుల తేడాలో లక్నో సూపర్ జెయింట్స్ పై విజయాన్ని సాధించింది.
టాపిక్