తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ashwin | కుంబ్లే రికార్డు కష్టమే.. కానీ అశ్విన్‌కు సాధ్యమే: గవాస్కర్

Ashwin | కుంబ్లే రికార్డు కష్టమే.. కానీ అశ్విన్‌కు సాధ్యమే: గవాస్కర్

15 March 2022, 19:32 IST

google News
    • అనిల్ కుంబ్లే రికార్డు దూరంగా ఉన్నప్పటికీ అది అందుకోగల సమర్థుడు అశ్విన్‌ మాత్రమేనని సునీల్ గవాస్కర్ కితాబిచ్చాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో అశ్విన్ 12 వికెట్లు తీశాడు. అంతేకాకుండా అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.
అశ్విన్ పై గవాస్కర్ ప్రశంసలు
అశ్విన్ పై గవాస్కర్ ప్రశంసలు (Feed)

అశ్విన్ పై గవాస్కర్ ప్రశంసలు

ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో అత్యుత్తమంగా బౌలింగ్ చేసిన రవిచంద్రన్ అశ్విన్‌.. కుంబ్లే తర్వాత అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో అశ్విన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్. తన ఆటతీరుతో రోజురోజుకు బాగా ఎదుగుతున్నాడని, రాబోయే రోజుల్లో మరిన్ని మైలురాళ్లు అందుకుంటాడని కితాబిచ్చాడు. టెస్టు క్రికెట్‌లో అనిల్ కుంబ్లే సాధించిన 619 వికెట్ల రికార్డును చేరుకోవడం కష్టమే అయినప్పటికీ.. అందుకు అశ్విన్‌ అన్ని విధాల సమర్థుడని తెలిపాడు.

"అనిల్ కుంబ్లేను అందుకోవాలంటే అశ్విన్‌ మరో 160 వికెట్లపైనే తీయాలి. ఈ రికార్డు చాలా దూరమే ఉన్నప్పటికీ అందుకు అశ్విన్ సమర్ధుడే. ఎందుకంటే అతడు రోజురోజుకు తన ఆటతీరును మెరుగుపరచుకుంటున్నాడు. అంతేకాకుండా అతడు తన రికార్డులను పట్టించుకోకుండా శ్రమిస్తూనే ఉన్నాడు." అని సునీల్ గవాస్కర్ స్పష్టం చేశాడు.

శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందు వరకు కపిల్ దేవ్ 434 వికెట్లతో అనిల్ కుంబ్లే తర్వాతి స్థానంలో ఉండేవాడు. అయితే అశ్విన్ ఈ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసి రెండు టెస్టుల్లో కలిపి 12 వికెట్లు తీశాడు. దీంతో అతడి మొత్తం టెస్టు వికెట్ల సంఖ్య 442కి చేరింది. దీంతో కపిల్‌ను వెనక్కి నెట్టి కుంబ్లే తర్వాతి స్థానానికి చేరాడు. అంతేకాకుండా 400కి పైగా టెస్టు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 8వ స్థానంలో నిలిచాడు. దీంతో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ సైకిల్స్‌లో 100 వికెట్లు తీసిన మొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు జరిగిన సైకిల్‌లో భారత్ ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో పజాయం పాలైంది.

శ్రీలంకతో ఇటీవల జరిగిన గులాబీ బంతి టెస్టులో బుమ్రా, అశ్విన్ తమ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో టీమిండియా విజయంతో కీలక పాత్ర పోషించారు. రెండు ఇన్నింగ్సుల్లో కలిపి అశ్విన్ 6 వికెట్లు తీయగా.. బుమ్రా 8 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఫలితంగా ఇండియా.. లంకపై సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది.

టాపిక్

తదుపరి వ్యాసం