Ravi Shastri on Sachin: సచిన్ ఆ విషయంలో అంచనాలకు అందని యుద్ధం చేశాడు.. మాస్టర్‌పై రవిశాస్త్రీ షాకింగ్ కామెంట్స్
29 March 2023, 8:58 IST
Ravi Shastri on Sachin: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ గురించి రవిశాస్త్రీ ఆశ్చర్యకర విషయాలను వెల్లడించాడు. ప్రేక్షకుల అంచనాలు సచిన్‌పై భారీగా ఉండేవని, వాటిని అందుకోలేనప్పుడు అతడి వైఫల్యంగా చూసేవాళ్లని అన్నాడు.
సచిన్ తెందూల్కర్
Ravi Shastri on Sachin: సచిన్ తెందూల్కర్(Sachin Tendulkar).. క్రికెట్‌లో ఎన్నో అత్యున్నత శిఖరాలు అధిరోహించిన గొప్ప ఆటగాడు. తన ఆటతీరుతో అభిమానులను విపరీతంగా అలరించిన మన మాస్టర్ 24 కెరీర్‌లో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్నాడు. అయితే టీమిండియా తరఫున అద్భుత విజయాలను సొంతం చేసిన సచిన్‌ను ఎక్కువగా ఓ విషయంలో విమర్శిస్తుంటే వారు. అదే సచిన్ సెంచరీ చేస్తే భారత్ మ్యాచ్ ఓడిపోతుంది. ఇది ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే టీమిండియా ఓటమికి కారణం సచినే అనేంతగా వ్యాప్తి చెందింది. ఒకానొక సమయంలో మనలో చాలా మంది కూడా మాస్టర్ శతకం చేయకపోతే బాగుండు అని అనుకున్నారనేది వాస్తవం. అయితే సచిన్‌పై వచ్చిన ఈ విమర్శల్లో ఏమైనా నిజముందా? అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే మన మాస్టర్ వన్డేల్లో 49 సెంచరీలు సాధిస్తే అందులో 33 సార్లు టీమిండియా విజయం సాధించింది. అంటే 67 శాతం విజయాలు నమోదయ్యాయి.
ఈ గణాంకాలను పక్కన పెడితే తెందూల్కర్ ఎన్నోసార్లు ఒత్తిడికి లోనయ్యాడట. ఈ విషయాన్ని భారత మాజీ కోచ్ రవిశాస్త్రీ(Ravi Shastri) చెప్పాడు. కెరీర్‌లో గాయాలు, కెప్టెన్సీ, వరల్డ్ కప్ ఓటములు వీటన్నింటి కంటే కూడా ప్రజల అంచనాలను అందుకోకపోయినప్పుడు కలిగే ఒత్తిడి విషయంలో ఎవరూ అతడి దగ్గరకు కూడా చేరుకోలేరని అన్నాడు.
"ప్రతిసారి అతడు(సచిన్) ఔట్ అయినప్పుడు.. దేశవ్యాప్తంగా ప్రేక్షకులందరూ అతడు సెంచరీ ఎప్పుడు చేస్తాడు? అని ఆత్రుతగా చూసేవాళ్లు. సెంచరీ చేయకపోతే అది అతడి వైఫల్యంగా భావించేవాళ్లు. దీని వల్ల అతడు కొన్నిసార్లు ఒంటరిగా ఫీలయ్యే వాడని నాకు మాత్రమే తెలుసు. ఉన్నత శిఖరాలను అదిరోహించినప్పుడు అక్కడ ఒంటరిగా ఉన్న భావన కలుగుతుంది. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో వారికి మాత్రమే అర్థమవుతాయి." అని రవిశాస్త్రీ చెప్పాడు.
బ్రాడ్‌మన్ అండ్ తెందూల్కర్- ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ అనే డాక్యూమెంటరీతో మాట్లాడినప్పుడు రవిశాస్త్రీ ఈ విషయాలను వెల్లడించాడు. "క్రికెట్‌లో సచిన్ గొప్పతనాన్ని నేను మొదటి సారి అతడికి 18 ఏళ్లప్పుడు చూశాను. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ల్లో అతడి ఆధిపత్యాన్ని చూస్తే మరో స్థాయిలో కనిపిస్తాడు. ఇక్కడే తెందూల్కర్.. బ్రాడ్‌మన్ స్థాయికి చేరుకోవడం ప్రారంభించాడు." అని రవిశాస్త్రీ తెలిపాడు.
"16 ఏళ్ల వయస్సులోనే అతడు 22-23 ఏళ్ల వారి కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడి ఉండొచ్చు. అతడు తన మొదటి టెస్టు ఆడినప్పుడు ఓవర్ డ్రైవ్‌లో ఉన్నాడు. ఇమ్రాన్, వసీం, వకార్ లాంటి దిగ్గజాల పేస్ ఎటాక్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు." అని రవిశాస్త్రీ స్పష్టం చేశాడు.