Sachin Statue at Wankhede: సచిన్‌కు అరుదైన గౌరవం.. విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు-sachin tendulkar life size statue will placed in wankhede ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Sachin Tendulkar Life Size Statue Will Placed In Wankhede

Sachin Statue at Wankhede: సచిన్‌కు అరుదైన గౌరవం.. విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు

Maragani Govardhan HT Telugu
Feb 28, 2023 11:33 AM IST

Sachin Statue at Wankhede: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ అరుదైన గౌరవం లభించనుంది. ముంబయి వాంఖడే వేదికగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ముంబయి క్రికెట్ అసొసియేషన్ నిర్ణయించింది.

సచిన్ తెందూల్కర్
సచిన్ తెందూల్కర్ (PTI)

Sachin Statue at Wankhede: గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ తెందూల్కర్ తన కెరీర్‌లో అందుకోని సత్కారాలు లేవు.. పొందని గౌరవాలు లేవు. తన కెరీర్‌లో భారతరత్న సహా ఎన్నో ఘనతలను అందుకున్న మన మాస్టర్ బ్లాస్టర్‌ మరో అరుదైన గౌరవం అందుకోనున్నారు. ఆయన రిటైరైన 10 ఏళ్ల తర్వాత ముంబయిలో మాస్టర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సచిన్ తన కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడిన వాంఖడే వేదికగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

సచిన్ 50వ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 23న ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు సమాచారం. లేదా ఈ ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్ సమయంలో లాంచ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ముంబయి క్రికెట్ అసొసియేషన్ అధ్యక్షులు అమోల్ కాలే మాట్లాడారు.

"వాంఖడేలో ఇదే మొదటి విగ్రహం. స్టేడియంలో ఎక్కడ పొందుపరుస్తామో చర్చించి మేము నిర్ణయం తీసుకుంటాం. ఆయన(సచిన్) భారతరత్న పురస్కార గ్రహీత అనే సంగతి అందరికీ తెలిసిందే. క్రికెట్‌కు ఆయన చేసిన సేవకు గుర్తుగా ముంబయి క్రికెట్ అసొసియేషన్ తరఫున చిన్న జ్ఞాపకాన్ని రూపొందించనున్నాం. ఈ విషయం గురించి మూడు వారాల క్రితమే సచిన్‌తో మాట్లాడాం. ఆయన సమ్మతి లభించింది." అని అమోల్ కాలే స్పష్టం చేశారు.

ఇప్పటికే వాంఖడేలో సచిన్ పేరుతో ఓ స్టాండ్ ఉంది. గతంలో ఎంసీఏ భారత దిగ్గజం సునీల్ గవాస్కర్‌ను కార్పోరేట్ బాక్స్‌తో, బ్యాటింగ్ ఏస్‌తో దిలీప్ వెంగ్‌సర్కార్‌ను సత్కరించాలని నిర్ణయించింది. దేశంలోని స్టేడియాల్లో క్రికెటర్ల లైఫ్ సైజ్ విగ్రహాలు చాలా వరకు లేవు. విదర్బ క్రికెట్ అసొసియేషన్, ఆంధ్రాలోని వీడీసీఏ స్టేడియం, ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో భారత తొలి కెప్టెన్ సీకే నాయుడు విగ్రహాలు వేర్వేరుగా ఉన్నాయి.

ఇదే సమయంలో సంబంధిత రాష్ట్ర సంఘాల్లో వారి పేరు మీద స్టాండ్‌లతో అనేక మంది ఆటగాళ్ల మైనపు విగ్రహాలు ఉన్నాయి. చాలా మంది మాజీ క్రికెటర్లకు కూడా లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహాలు ఉన్నాయి. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండులో దివంగత షేన్ వార్న్ విగ్రహం ఉంది.

200 టెస్టులు, 463 అంతర్జాతీయ వన్డేలు ఆడిన సచిన్ తెందూల్కర్.. రెండు ఫార్మాట్లలో కలిపి 34,357 పరుగులు చేశాడు. ఇందులో వంద ఇంటర్నేషనల్ సెంచరీలు ఉన్నాయి. నేటి వరకు ఈ రికార్డు ఎవ్వరూ అధిగమించలేదు.

WhatsApp channel

టాపిక్