Ravi Shastri on Team India: ఫీల్డింగ్ ఎంచుకున్నప్పుడే పాజిటివ్‌గా లేరని తేలిపోయింది: రవిశాస్త్రి
08 June 2023, 12:37 IST
- Ravi Shastri on Team India: ఫీల్డింగ్ ఎంచుకున్నప్పుడే పాజిటివ్‌గా లేరని తేలిపోయిందని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. ఇండియన్ రక్షణాత్మక ధోరణిని అతడు తప్పుబట్టాడు.
టీమిండియా
Ravi Shastri on Team India: డబ్ల్యూటీసీ ఫైనల్ తొలి రోజు టీమిండియా బౌలర్లు తేలిపోయిన తర్వాత రోహిత్ సేనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలా మంది మాజీలు అశ్విన్ ను ఎంపిక చేయడాన్ని తప్పుబట్టారు. అయితే మాజీ కోచ్ రవిశాస్త్రి మాత్రం టీమిండియా రక్షణాత్మక ధోరణిని ఎండగట్టాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతోనే రోహిత్ పాజిటివ్ మైండ్‌సెట్ తో లేడని అర్థమైపోయిందని అన్నాడు.
"ఇవాళ ఆట చూస్తే ఒకటే అనిపిస్తోంది. టాస్ గెలిస్తే ఫీల్డింగ్ ఎంచుకోవాలన్న ఉద్దేశంతోనే బౌలింగ్ డిపార్ట్‌మెంట్ లో నలుగురు సీమర్లు, ఒక స్పిన్నర్ తో బరిలోకి దిగారు. ఒకవేళ పాజిటివ్ మైండ్‌సెట్ ఉండి ఉంటే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకునే వాళ్లు. తొలి సెషన్ లో జాగ్రత్తగా ఆడి, కనీసం 250 పరుగులైనా చేయగలమేమో చూడాల్సింది. 250-260 కాదు.. తర్వాత కండిషన్స్ మెరుగై తొలి సెషన్ గడిపేస్తే.. అంతకంటే ఎక్కువ కూడా చేసేవాళ్లు" అని రవిశాస్త్రి అన్నాడు.
ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో ఉందని కూడా శాస్త్రి స్పష్టం చేశాడు. "ఆస్ట్రేలియా మంచి పొజిషన్ లో ఉందని నేను అనుకుంటున్నాను. ఇండియాను మళ్లీ పుంజుకునేలా చేస్తారా లేదా అన్నది వాళ్లు చేతుల్లోనే ఉంది. బ్యాటింగ్ చాలా బాగా చేశారు. ముఖ్యంగా తొలి సెషన్ లో బాగా ఆడటం వల్లే తర్వాత మంచి స్కోరు చేయగలిగారు" అని శాస్త్రి చెప్పాడు.
రెండో రోజు రెండో కొత్త బంతిని సరిగా ఉపయోగించుకుంటేనే ఇండియన్ టీమ్ మళ్లీ ట్రాక్ పైకి వచ్చే అవకాశం ఉంటుందని కూడా రవిశాస్త్రి అన్నాడు. "వికెట్ల గురించే ఆలోచించాలి. లేదంటే ఈ మ్యాచ్ చేజారినట్లే. ఆస్ట్రేలియా టీ సమయానికి మరో 200 అయినా జోడిస్తుంది. అందుకే రెండో కొత్త బంతితో తొలి 45 నిమిషాల్లోనే వికెట్లు తీయడానికి ప్రయత్నించాలి" అని శాస్త్రి తెలిపాడు.