Ravi Shastri on WTC Final: ఆస్ట్రేలియా పేపర్‌పైనే ఫేవరెట్స్: రవిశాస్త్రి షాకింగ్ కామెంట్స్
Ravi Shastri on WTC Final: ఆస్ట్రేలియా పేపర్‌పైనే ఫేవరెట్స్ అని రవిశాస్త్రి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య బుధవారం (జూన్ 7) నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే.
Ravi Shastri on WTC Final: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ కు టైమ్ దగ్గర పడుతున్న కొద్దీ మాజీ క్రికెటర్లు ఈ మ్యాచ్ ఎలా జరగబోతోందన్న విశ్లేషణలు చేస్తున్నారు. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా దీనిపై స్పందించాడు. ఆస్ట్రేలియాను పేపర్ పై చూస్తే టీమిండియా కంటే ఫేవరెట్ గా కనిపిస్తున్నా.. ఈ మ్యాచ్ కు బాగా సిద్ధమైంది మాత్రం ఇండియానే అని స్పష్టం చేశాడు.
రవిశాస్త్రియే కాదు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. "పేస్ బౌలింగ్ చూస్తే ఒకవేళ బుమ్రా ఉండి ఉంటే బుమ్రా, షమి, సిరాజ్ లతో ఇద్దరూ సమంగా ఉన్నారని చెప్పేవాన్ని. కానీ ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్ స్టార్క్, కమిన్స్ లతో కాస్త బలంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడే ఫిట్‌నెస్ అనేది కూడా ముఖ్యం.
అంటే మ్యాచ్ ఫిట్‌నెస్. ఇలాంటి మ్యాచ్ కు వెళ్లే ముందు ఈ మధ్య కాలంలో కాస్తయినా క్రికెట్ ఆడి ఉండాలి. ఐదు రోజుల పాటు రోజుకు ఆరు గంటల పాటు క్రికెట్ ఫీల్డ్ లో ఉండటం వేరు, రెండు గంటల పాటు నెట్స్ లో ప్రాక్టీస్ చేయడం వేరు. షమి కీలకం కానున్నాడు. ఎందుకంటే అతడు చాలా క్రికెట్ ఆడుతున్నాడు" అని శాస్త్రి అభిప్రాయపడ్డాడు.
పాంటింగ్ దీనిపై స్పందిస్తూ.. ఫ్రెష్ గా అడుగుపెట్టడం మంచిదా లేక చాలా క్రికెట్ ఆడి అలసిపోయి రావడం మంచిదా అన్నదానిపై స్పష్టంగా చెప్పలేదు. "కొందరు ఆస్ట్రేలియా ఆటగాళ్లు చాలా ఫ్రెష్ గా ఉన్నారు. వాళ్లు ఏమీ ఆడలేదు. అది మంచిదా? లేక కాస్త అలసిపోయినట్లు ఉన్నా చాలా క్రికెట్ ఆడారు. మరి అది మంచిదా" అని దానికి సమాధానం చెప్పకుండా పాంటింగ్ దాటవేశాడు.
ఇక ఇదే షోలో వసీం అక్రమ్ కూడా స్పందించాడు. "ఓ ప్లేయర్ గా ఎంతో క్రికెట్ ఆడిన వాడిగా చెబుతున్నాను. నేను ఆడుతున్నంత కాలం ఫార్మాట్ తో సంబంధం లేదు. ఐపీఎల్ లాంటి టోర్నీ ఆడటం మంచిదే" అని స్పష్టం చేశాడు. అయితే జూన్ లో ఇప్పటి వరకూ ఓవల్ లో ఒక్క టెస్టు కూడా జరగలేదు. దీంతో ఈసారి ఈ మ్యాచ్ లో పిచ్ ఎలా వ్యవహరిస్తుందన్నది తెలియడం లేదు.
ఇందులో బౌన్స్ ఎక్కువగా ఉంటుందని, డ్యూక్స్ ఎక్కువగా, ఎక్కువ సమయం పాటు స్వింగ్ అవుతుందని, కూకాబుర్రా కంటే గట్టిగా ఉంటుందని, అందువల్ల ఆస్ట్రేలియా కాస్త ఫేవరెట్స్ గా కనిపిస్తోందని అక్రమ్ అభిప్రాయపడ్డాడు. అటు పాంటింగ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక్కడ ఇంగ్లండ్ కంటే ఆస్ట్రేలియా కండిషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయని, ఇక జూన్ లో ఓవల్ పిచ్ చాలా ఫ్రెష్ గా ఉండటం వల్ల బౌన్స్ కు అనుకూలిస్తుందని, అదే ఆస్ట్రేలియాకు మేలు చేస్తుందని చెప్పాడు.
సంబంధిత కథనం