Ravi Shastri on Rohit Sharma: అహ్మదాబాద్ టెస్ట్ రోహిత్‌కు గుణపాఠం.. అతని కెప్టెన్సీకి పరీక్ష: రవిశాస్త్రి
10 March 2023, 13:01 IST
- Ravi Shastri on Rohit Sharma: అహ్మదాబాద్ టెస్ట్ రోహిత్‌కు గుణపాఠం.. అతని కెప్టెన్సీకి అసలుసిసలు పరీక్ష అని అన్నాడు మాజీ కోచ్ రవిశాస్త్రి. బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న ఈ పిచ్ పై ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు వైపు వెళ్తోంది.
రోహిత్ శర్మ
Ravi Shastri on Rohit Sharma: ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి మూడు టెస్టులు ఎప్పుడు ప్రారంభమయ్యాయో ఎప్పుడు ముగిశాయో తెలియని పరిస్థితి. ఈ మూడు టెస్టులూ స్పిన్ కు విపరీతంగా అనుకూలించిన పిచ్ లపై మూడు రోజుల్లోపే ముగిసిపోయాయి. ఇలాంటి పిచ్ లపై ఓ కెప్టెన్ కు పెద్దగా మెదడుకు పని చెప్పాల్సిన అవసరం రాలేదు.
ఇప్పుడు రోహిత్ పరిస్థితి కూడా అలాగే ఉంది. అతడు కెప్టెన్సీ చేపట్టినప్పటి నుంచీ స్వదేశంలో ఇలాంటి స్పిన్ పిచ్ లపై సులువుగా గెలుస్తూ వచ్చాడు. కానీ అహ్మదాబాద్ టెస్ట్ కు వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. ఇక్కడ బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై ఆస్ట్రేలియా బ్యాటర్లను నిలువరించలేక రోహిత్ సతమతమవుతున్నాడు. ఇద్దరు ఆస్ట్రేలియా బ్యాటర్లు సెంచరీలు చేశారు. ఐదో వికెట్ కు ఇప్పటికే రెండు వందలకుపై గా పరుగులు జోడించారు.
ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ అతనికో గుణపాఠమని, కెప్టెన్సీకి అసలుసిసలు పరీక్ష అని అన్నాడు మాజీ కోచ్ రవిశాస్త్రి. "రోహిత్ శర్మకు ఇదో గుణపాఠం. ఈ మధ్య టెస్టులు వేగంగా ముగుస్తున్నాయి. వేగం పెరిగింది. కానీ ఈ టెస్టు మాత్రం పిచ్ చాలా బాగుంది. వికెట్లు అంత సులువుగా దొరకడం లేదు. ఇలాంటి సమయంలోనే మెదడుకు పని చెప్పాలి. ఉన్న వనరులను సరిగ్గా వాడుకోవాలి. విదేశాల్లో కెప్టెన్సీ ఒక సవాలైతే, ఇండియాలో మంచి పిచ్ లపై కెప్టెన్సీ మరో సవాలు" అని స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ రవిశాస్త్రి అన్నాడు.
రోహిత్ కు అన్ని నైపుణ్యాలు ఉన్నాయని, కానీ ఇలాంటి పరిస్థితినే అతను సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డాడు. మరోవైపు ఇండియా, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు మురళీ కార్తీక్, మిచెల్ జాన్సన్.. రోహిత్ కెప్టెన్సీని ప్రశ్నించారు. ముఖ్యంగా తొలి రోజు కొత్త బంతి తీసుకోవాలన్న నిర్ణయంతోపాటు ఆ బంతితో పేస్ బౌలర్లకు కేవలం రెండే ఓవర్లు ఇవ్వడాన్ని వీళ్లు తప్పుబట్టారు.
ఇలాంటి పరిస్థితుల్లో పేస్ బౌలర్లపై నమ్మకం ఉంచాల్సిన అవసరం ఉన్నదని మిచెల్ జాన్సన్ అన్నాడు. కొత్త బంతితో స్పిన్నర్లు బౌలింగ్ చేయడంతో ఆస్ట్రేలియా తొలి రోజు చివరి 9 ఓవర్లలోనే 54 రన్స్ చేసింది. ఇదే మ్యాచ్ ను మలుపు తిప్పిందని చెప్పొచ్చు.