Ravi Shastri on Indore Test: ఓవర్ కాన్ఫిడెన్సే కొంప ముంచింది: రవిశాస్త్రి
03 March 2023, 14:09 IST
- Ravi Shastri on Indore Test: ఓవర్ కాన్ఫిడెన్సే కొంప ముంచిందని అన్నాడు మాజీ కోచ్ రవిశాస్త్రి. ఇండోర్ టెస్ట్ ఓటమిపై మ్యాచ్ తర్వాత స్పందించిన శాస్త్రి.. కాస్త ఘాటుగానే స్పందించాడు.
ఇండోర్ టెస్టులో ఓటమి తర్వాత టీమిండియా
Ravi Shastri on Indore Test: ఇండోర్ టెస్ట్ లో టీమిండియా అనూహ్య ఓటమి అభిమానులకే కాదు.. మాజీ క్రికెటర్లకూ మింగుడు పడటం లేదు. ఇప్పటికే గవాస్కర్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. పిచ్ ముందు తలవంచారంటూ ఇండియన్ టీమ్ పై విమర్శలు గుప్పించాడు. ఇక తాజాగా మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా అలాంటి వ్యాఖ్యలే చేశాడు.
ఓవర్ కాన్ఫిడెన్సే టీమ్ కొంప ముంచిందని అతడు అనడం గమనార్హం. మూడో టెస్టులో 9 వికెట్లతో గెలిచిన ఆస్ట్రేలియా నాలుగు టెస్టుల సిరీస్ లో ఇండియా ఆధిక్యాన్ని 2-1కి తగ్గించిన విషయం తెలిసిందే. కంగారూలను గత రెండు టెస్టుల్లోలాగే స్పిన్ తో కొట్టాలని చూసిన ఇండియన్ టీమ్ కు షాక్ తగిలింది. నిజానికి టాస్ రూపంలోనూ కలిసొచ్చినా.. సద్వినియోగం చేసుకోలేకపోయింది.
దీంతో మ్యాచ్ తర్వాత ఈ ఓటమిపై స్పందించిన రవిశాస్త్రి.. టీమ్ చేసిన అతి వల్లే ఇలా జరిగిందని అన్నాడు. "కాస్త అలసత్వం, మరికాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఇలా జరుగుతుంది. ఏం చేసినా చెల్లుతుందన్న ధోరణిలో ఉంటే పరిస్థితులు తిరగబడతాయి" అని రవిశాస్త్రి స్పష్టం చేశాడు. కఠినమైన పరిస్థితుల్లోనూ డామినేట్ చేయాలని చూడటం కూడా నష్టం చేసిందని అన్నాడు.
"తొలి ఇన్నింగ్స్ ఆడిన విధానం చూస్తే నేను చెప్పినవన్నీ కారణాలుగా కనిపిస్తాయి. మన బ్యాటర్లు ఆడిన కొన్ని షాట్లు చూడండి. కఠినమైన పరిస్థితుల్లోనూ డామినేట్ చేయాలన్న అతి ఆతృత కనిపిస్తుంది. కాస్త వెనక్కి వెళ్లి చూస్తే అక్కడేం జరిగిందో విశ్లేషించవచ్చు" అని రవిశాస్త్రి చెప్పాడు.
ఇక ఇండోర్ టెస్టులో ఇండియా తుది జట్టులో చేసిన మార్పులు కూడా ఈ ఓటమికి ఒక కారణమని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ అన్నాడు. "జట్టులో చేసిన మార్పులు కూడా. కేఎల్ రాహుల్ ను తప్పించారు. ఇలాంటివి జట్టును అస్థిరపరుస్తాయి.
ప్లేయర్స్ జట్టులో తమ స్థానం కోసం ఆడినప్పుడు కూడా వాళ్ల మైండ్ సెట్ వేరుగా ఉంటుంది. ట్రావిస్ హెడ్ ను చూస్తే ఇది తెలుస్తుంది. అతన్ని తొలి టెస్ట్ నుంచి తప్పించారు. కానీ ఆ తర్వాత అతడు మరింత ఆకలితో రెండో టెస్టు బరిలో దిగి పరుగులు సాధిస్తున్నాడు" అని హేడెన్ అన్నాడు.