Gavaskar on Team India: పిచ్‌కు తలవంచారు.. ఓటమిపై గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు-gavaskar on team india says they let pitch over take them ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Gavaskar On Team India Says They Let Pitch Over Take Them

Gavaskar on Team India: పిచ్‌కు తలవంచారు.. ఓటమిపై గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు

Hari Prasad S HT Telugu
Mar 03, 2023 01:14 PM IST

Gavaskar on Team India: పిచ్‌కు తలవంచారు అంటూ ఇండోర్ టెస్ట్ ఓటమిపై గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. స్వదేశంలో ఆడుతూ మూడు రోజుల్లోనే ఆస్ట్రేలియా చేతుల్లో ఓడిపోవడం అభిమానులకు మింగుడు పడటం లేదు.

విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ (PTI)

Gavaskar on Team India: స్వదేశంలో కండిషన్స్ ను తమకు అనుకూలంగా మలచుకోవాలని ఏ టీమైనా భావిస్తుంది. ఇండియా కూడా అందుకు భిన్నమేమీ కాదు. అందుకే ఏ టీమ్ వచ్చినా స్పిన్ పిచ్ లు తయారు చేసి వాళ్లను బోల్తా కొట్టిస్తుంది. అయితే అదే స్పిన్ పిచ్ పై తానే బోల్తా పడటం మాత్రం చాలా అరుదుగా జరుగుతుంది. ఇప్పుడు ఇండోర్ టెస్టులో అదే జరిగింది.

స్పిన్ కు విపరీతంగా అనుకూలిస్తున్న పిచ్.. టాస్ కూడా గెలిచారు.. అయినా మూడు రోజుల్లోపే ఇండియాను ఆస్ట్రేలియా ఓడించగలిగింది. ఈ ఓటమిపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఘాటుగా స్పందించాడు. ఇండియన్ టీమ్ పిచ్ కు తలవంచిందని అతడు మూడో టెస్టు ముగిసిన తర్వాత అన్నాడు. ఈ విజయంతో నాలుగు టెస్టుల సిరీస్ లో ఇండియా ఆధిక్యాన్ని 2-1కి తగ్గించగలిగింది ఆస్ట్రేలియా.

గవాస్కర్ రియాక్షన్ ఇదీ

"తొలి రెండు టెస్టుల్లోనూ వాళ్లు పరుగులు చేయలేకపోయారు. నాగ్‌పూర్ లో రోహిత్ శర్మ మినహా మిగతా ఎవరూ రన్స్ చేయలేదు. పరుగులు సాధించలేని సమయాల్లో బ్యాటింగ్ లో సరైన ఆత్మ విశ్వాసం కనిపించదు" అని గవాస్కర్ అన్నాడు. మన బ్యాటర్ల మెదళ్లను పిచ్ చాలా ప్రభావితం చేసిందనీ చెప్పాడు.

"వాళ్లు సరిపడా పరుగులు చేయలేదు. పిచ్ పై కాస్త ముందుకు వచ్చి ఆడాల్సి ఉన్నా అలా చేయలేకపోయారు. పిచ్ కు తలవంచారు. ఎంతసేపూ వాళ్ల మెదళ్లలో పిచ్ గురించే ఆలోచించారు. రెండో ఇన్నింగ్స్ లో ఇది మరింత ఎక్కువగా కనిపించింది" అని గవాస్కర్ అన్నాడు.

ఇండోర్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 109, రెండో ఇన్నింగ్స్ లో 163 పరుగులు మాత్రమే చేయగలిగింది టీమిండియా. తొలి ఇన్నింగ్స్ లో 197 పరుగులు చేసి 88 పరుగుల ఆధిక్యం సంపాదించిన ఆస్ట్రేలియా.. అక్కడే సగం మ్యాచ్ గెలిచేసింది.

ఇలాంటి పిచ్ పై కష్టమే: మంజ్రేకర్

అటు మరో మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కూడా ఇండోర్ టెస్ట్ ఓటమిపై స్పందించాడు. ఇలాంటి పిచ్ లపై ఫామ్ లో లేని బ్యాటర్లు తిరిగి ఫామ్ లోకి రావడం కష్టమే అని అన్నాడు. "ముందు మనందరం అంగీకరించాల్సిన విషయం ఏంటంటే.. బౌలింగ్ ఆధిపత్యమే కొనసాగింది. సిరీస్ మొత్తం బ్యాటింగ్ కు కఠినమైన పరిస్థితులే ఎదురయ్యాయి" అని మంజ్రేకర్ అన్నాడు.

"ఫామ్ లో లేకుండా ఇలాంటి సిరీస్ లో అడుగుపెడితే.. ఇలాంటి పిచ్ లపై తిరిగి ఫామ్ లోకి రావడం కష్టం. విరాట్ కోహ్లి వన్డేల్లో మూడు సెంచరీలు చేశాడు. ఫామ్ లోకి తిరిగి రావడానికి అది చాలు" అని మంజ్రేకర్ చెప్పాడు.

WhatsApp channel

సంబంధిత కథనం