Rahul Dravid on Rohit Injury: రోహిత్ సహా ముగ్గురు ప్లేయర్స్ మూడో వన్డే ఆడటం లేదు: కోచ్ ద్రవిడ్
07 December 2022, 22:18 IST
- Rahul Dravid on Rohit Injury: రోహిత్ సహా ముగ్గురు ప్లేయర్స్ మూడో వన్డే ఆడబోవడం లేదని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు. ఇప్పటికే సిరీస్ ఓడిన టీమిండియాకు ఇది పెద్ద షాక్‌లాంటి వార్తే.
రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్
Rahul Dravid on Rohit Injury: బంగ్లాదేశ్ చేతుల్లో ఇప్పటికే వన్డే సిరీస్ ఓడిన టీమిండియాకు మరో షాక్ తగిలింది. సిరీస్ క్లీన్‌స్వీప్ తప్పించుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన చివరి మ్యాచ్‌కు ముగ్గురు ప్లేయర్స్ గాయాల కారణంగా దూరమయ్యారు. ఈ విషయాన్ని రెండో వన్డే తర్వాత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడే వెల్లడించాడు.
ఈ ముగ్గురిలో కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఉన్నాడు. రెండో వన్డేలో రోహిత్ ఎడమ చేతి బొటన వేలికి గాయమైన విషయం తెలిసిందే. అతడు ఇంజెక్షన్లు తీసుకొని మరీ రెండో వన్డేలో బ్యాటింగ్‌కు దిగినట్లు ద్రవిడ్ చెప్పాడు. అయినా అతడు అద్భుతంగా పోరాడాడు. కానీ టీమ్‌ను మాత్రం గెలిపించలేకపోయాడు. అయితే మ్యాచ్ తర్వాత మీడియాతో మాట్లాడిన ద్రవిడ్.. రోహిత్ గాయంపై కీలకమైన అప్‌డేట్ ఇచ్చాడు.
రోహిత్‌తోపాటు పేస్ బౌలర్ దీపక్ చహర్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌లు కూడా మూడో వన్డేకు దూరమైనట్లు ద్రవిడ్ వెల్లడించాడు. "మేము కొన్ని గాయాల కారణంగా ఇబ్బంది పడుతున్నాం. దీపక్ చహర్, రోహిత్ కచ్చితంగా మూడో మ్యాచ్ ఆడబోవడం లేదు. కుల్దీప్ సిరీస్ మొత్తానికీ దూరమయ్యాడు. రోహిత్ ముంబైకి తిరిగి వెళ్లనున్నాడు. అక్కడ స్పెషలిస్ట్‌ను కలుస్తాడు. టెస్ట్ సిరీస్‌కు తిరిగి వస్తాడా లేదా చూడాలి. ఇప్పుడే ఏమీ చెప్పలేం. అయితే తర్వాతి మ్యాచ్ మాత్రం అతడు ఆడటం లేదు" అని ద్రవిడ్ చెప్పాడు.
సిరీస్‌లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన రెండో వన్డేలో బౌలర్లు చేతులెత్తేయడం, టాపార్డర్ విఫలమవడం టీమ్ కొంప ముంచింది. అయినా 9వ నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ పోరాడాడు. కేవలం 28 బాల్స్‌లోనే 51 రన్స్ చేశాడు. అయితే చివరికి 5 పరుగుల తేడాతో ఇండియన్ టీమ్‌కు ఓటమి తప్పలేదు. తనకు ఫ్రాక్చర్ కాకపోయినా.. వేలిలో ఎముక పక్కకు జరిగినట్లు మ్యాచ్ తర్వాత రోహిత్ చెప్పాడు.