Rohit Sharma Injury: రోహిత్ శర్మ గాయం తీవ్రత ఎంత.. ఇదీ కెప్టెన్‌ ఇచ్చిన అప్‌డేట్-rohit sharma injury team india captain gives massive update on his injury ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rohit Sharma Injury: రోహిత్ శర్మ గాయం తీవ్రత ఎంత.. ఇదీ కెప్టెన్‌ ఇచ్చిన అప్‌డేట్

Rohit Sharma Injury: రోహిత్ శర్మ గాయం తీవ్రత ఎంత.. ఇదీ కెప్టెన్‌ ఇచ్చిన అప్‌డేట్

Hari Prasad S HT Telugu
Dec 07, 2022 09:08 PM IST

Rohit Sharma Injury: రోహిత్ శర్మ గాయం తీవ్రత ఎంత? బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో అతడు గాయపడిన తర్వాత ఫ్యాన్స్‌లో ఇదే ప్రశ్న తలెత్తింది. అయితే దీనిపై మ్యాచ్‌ తర్వాత రోహితే అప్‌డేట్‌ ఇచ్చాడు.

రోహిత్ శర్మ
రోహిత్ శర్మ (AFP)

Rohit Sharma Injury: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఎడమ చేతి బొటన వేలికి గాయమైన విషయం తెలుసు కదా. బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో ఫీల్డింగ్‌ చేస్తూ అతడు గాయపడ్డాడు. వెంటనే ఫీల్డ్‌ వదిలి నేరుగా హాస్పిటల్‌కు వెళ్లడంతో ఫ్యాన్స్‌లో ఆందోళన కలిగింది. తర్వాత బ్యాటింగ్‌లోనూ ఓపెనింగ్‌ కాదు కదా.. తప్పనిసరి పరిస్థితుల్లో 9వ స్థానంలో దిగాడు.

చివరి బంతి వరకూ అద్భుతంగా పోరాడినా టీమ్‌ను గెలిపించలేకపోయాడు. గాయంతోనూ 28 బాల్స్‌లోనే 51 రన్స్‌ చేసి అజేయంగా నిలిచిన రోహిత్‌.. చివరి బంతికి సిక్స్‌ కొట్టలేకపోవడంతో టీమిండియా 5 రన్స్‌ తేడాతో ఓడింది. అయితే అతడు ఆడిన తీరు చూస్తే గాయం తీవ్రత పెద్దగా లేనట్లుగా అందరూ భావించారు. మ్యాచ్‌ తర్వాత రోహిత్ కూడా ఇదే విషయం చెప్పాడు.

తన వేలికి ఫ్రాక్చర్‌ అయితే కాలేదని, ఎముక కాస్త జరిగినట్లు వివరించాడు. గాయం కాస్త పెద్దదే అని, బొటనవేలు నొప్పి తీవ్రంగానే ఉన్నదని చెప్పాడు. గాయం తగిలిన వెంటనే హాస్పిటల్‌కు వెళ్లిన రోహిత్‌కు స్కాన్‌లు నిర్వహించారు. ఆ తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌లో కనిపించిన రోహిత్‌ వేలికి పట్టీ ఉంది. దీంతో అతడు బ్యాటింగ్‌కు దిగేది డౌటే అనుకున్నారు.

వరుసగా వికెట్లు పడుతున్నా.. అతడు బ్యాటింగ్‌కు రాలేదు. అయితే చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో ఏడో వికెట్‌ పడిన తర్వాత 43వ ఓవర్లో రోహిత్‌ అలాగే బ్యాటింగ్‌కు దిగాడు. ఆ సమయానికి ఇండియా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. తన ఇన్నింగ్స్‌ను మెల్లగా మొదలుపెట్టిన రోహిత్‌.. ఇబాదత్‌ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు కొట్టి జోరు పెంచాడు. ఇక ఇన్నింగ్స్‌ 49వ ఓవర్లో మహ్మదుల్లా బౌలింగ్‌లోనూ రెండు సిక్స్‌లు బాదాడు.

చివరి ఓవర్లో 20 రన్స్‌ అవసరం కాగా.. ముస్తఫిజుర్‌ వేసిన ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్‌ కొట్టాడు. చివరి బంతికి సిక్స్ అవసరం కాగా.. యార్కర్‌ వేయడంతో రోహిత్‌ భారీ షాట్‌ ఆడలేకపోయాడు. "నిజం చెప్పాలంటే నా బొటనవేలు అంత బాగా ఏమీ లేదు. వేలి ఎముక కాస్త పక్కకు జరిగింది. కానీ ఫ్రాక్చర్‌ మాత్రం కాలేదు. అందుకే నేను బ్యాటింగ్‌ చేయగలిగాను" అని మ్యాచ్‌ తర్వాత రోహిత్‌ తెలిపాడు.

"గాయాలపై కొన్ని ఆందోళనలు ఉన్నాయి. వాటి గురించి ఆలోచించాలి. వాళ్లు చాలా ఎక్కువ క్రికెట్‌ ఆడుతున్నారు. దీనిపై ఆలోచించి వాళ్లపై ఉన్న పనిభారంపై నేషనల్‌ క్రికెట్‌ అకాడెమీలోని మా టీమ్‌ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. సగం ఫిట్‌గా ఉన్న ప్లేయర్స్‌ టీమిండియాకు ఆడటం సరికాదు" అని రోహిత్‌ అనడం గమనార్హం. రెండో వన్డేలోనూ టీమిండియా ఓటమికి బౌలర్లే కారణమని కూడా అతడు అన్నాడు. మిడిల్‌, చివరి ఓవర్లు టీమ్‌ను దెబ్బతీస్తున్నాయని చెప్పాడు.

Whats_app_banner