Sehwag on Team India: క్రిప్టోల కంటే దారుణంగా పతనమవుతున్నారు.. టీమిండియాపై మండిపడిన సెహ్వాగ్
Sehwag on Team India: క్రిప్టోల కంటే దారుణంగా పతనమవుతున్నారంటూ టీమిండియాపై తీవ్రంగా మండిపడ్డాడు సెహ్వాగ్. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ ఓడిపోయిన తర్వాత వీరూ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
Sehwag on Team India: బంగ్లాదేశ్ గడ్డపై వరుసగా రెండో వన్డే సిరీస్‌ను కోల్పోయింది టీమిండియా. 2015లో తొలిసారి ఆ టీమ్ చేతుల్లో వన్డే సిరీస్‌లో ఓడిన ఇండియన్ టీమ్.. ఇప్పుడు మరో వన్డే మిగిలి ఉండగానే సిరీస్ సమర్పించుకుంది. వరుసగా రెండో వన్డేలోనూ ఓటమితో బంగ్లా టీమ్ 2-0తో తిరుగులేని ఆధిక్యం సంపాదించింది.
బుధవారం (డిసెంబర్ 7) జరిగిన రెండో వన్డేలో టీమిండియా 5 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మ గాయంతోనూ చివరి బంతి వరకూ పోరాడినా ఓటమి తప్పలేదు. మొదట టెయిలెండర్లను ఔట్ చేయలేక చేతులెత్తేసిన బౌలర్లు, తర్వాత దారుణంగా విఫలమైన టాపార్డర్ ఇండియన్ టీమ్ ఓటమికి ప్రధాన కారణాలని చెప్పొచ్చు.
మూడు వన్డేల సిరీస్‌ను ఓడిపోయిన తర్వాత ఇండియన్ టీమ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అయితే తనదైన స్టైల్లో చేసిన విమర్శనాత్మక ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. "మన ఆట క్రిప్టోల కంటే కూడా వేగంగా పతనమవుతోంది. ఇప్పటికైనా మేల్కోండి. పూర్తి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది" అని వీరూ ట్వీట్ చేశాడు.
మొదటి వన్డేలోనూ మన బ్యాటర్లు దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. కేవలం 186 రన్స్‌కే పరిమితమైంది. తర్వాత చేజింగ్‌లో బంగ్లాను కట్టడి చేసినా.. చివరి వికెట్ తీయలేక పరాజయం పాలైంది. ఆ మ్యాచ్‌లో హీరోగా నిలిచిన మెహదీ హసనే రెండో వన్డేలోనూ సెంచరీతో బంగ్లాకు భారీ స్కోరు సాధించి పెట్టాడు. రెండు మ్యాచ్‌లలోనూ కీలకమైన సమయంలో బ్యాటర్లు, బౌలర్ల వైఫల్యం టీమ్ కొంప ముంచింది.