Ind vs Ban 2nd ODI: గాయంతోనూ రోహిత్ పోరాడినా టీమిండియాకు తప్పని ఓటమి-ind vs ban 2nd odi rohit sharma fight not enough for india as bangladesh win by 5 runs ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ind Vs Ban 2nd Odi: గాయంతోనూ రోహిత్ పోరాడినా టీమిండియాకు తప్పని ఓటమి

Ind vs Ban 2nd ODI: గాయంతోనూ రోహిత్ పోరాడినా టీమిండియాకు తప్పని ఓటమి

Hari Prasad S HT Telugu
Dec 07, 2022 08:04 PM IST

Ind vs Ban 2nd ODI: గాయంతోనూ కెప్టెన్‌ రోహిత్ శర్మ పోరాడినా టీమిండియాకు ఓటమి తప్పలేదు. దీంతో రెండో వన్డేలో బంగ్లాదేశ్‌ విజయం సాధించి.. ఇండియాపై సిరీస్‌ గెలిచింది. 2015లోనూ సొంతగడ్డపై ఇండియాను ఓడించిన బంగ్లా టీమ్.. ఇప్పుడు కూడా అదే రిపీట్ చేసింది.

ఇండియాపై వన్డే సిరీస్ గెలిచిన బంగ్లాదేశ్
ఇండియాపై వన్డే సిరీస్ గెలిచిన బంగ్లాదేశ్ (AP)

Ind vs Ban 2nd ODI: కెప్టెన్‌ రోహిత్ శర్మ అద్భుతమైన పోరాటం కూడా ఇండియాను గెలిపించలేకపోయింది. అతడు కేవలం 28 బాల్స్‌లోనే 51 రన్స్‌ చేసి అజేయంగా నిలిచినా.. రెండో వన్డేలో ఇండియా 5 రన్స్‌ తేడాతో ఓడిపోయింది. 272 రన్స్‌ టార్గెట్‌తో దిగిన ఇండియా చివరికి 50 ఓవర్లలో 9 వికెట్లకు 266 రన్స్‌ దగ్గర ఆగిపోయింది. ఎడమ చేతి బొటన వేలికి గాయమైనా కూడా 9వ నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ పోరాడిన తీరు మాత్రం అద్భుతం.

yearly horoscope entry point

విజయానికి చివరి 3 ఓవర్లలో 40 అవసరం అయిన సమయంలోనూ రోహిత్‌ వెనుకడుగు వేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ 48వ ఓవర్‌లో స్ట్రైక్‌లో ఉన్న సిరాజ్‌ ఒక్క పరుగూ చేయలేకపోయాడు. దీంతో 12 బాల్స్‌లో 40 రన్స్‌ అవసరమయ్యాయి. అయితే మహ్మదుల్లా వేసిన 49వ ఓవర్లో రోహిత్‌ 17 రన్స్‌ రాబట్టడంతోపాటు మూడు వైడ్లు కూడా రావడంతో ఆ ఓవర్లో మొత్తం 20 రన్స్‌ వచ్చాయి.

చివరి ఓవర్లో 20 అవసరం కాగా.. ముస్తఫిజుర్‌ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్స్‌ కొట్టి మ్యాచ్‌పై రోహిత్‌ ఆశలు రేపాడు. చివరి బంతికి సిక్స్‌ అవసరమైన సమయంలో ముస్తఫిజుర్‌ యార్కర్‌ వేయడంతో రన్ రాలేదు. దీంతో వరుసగా రెండో వన్డేలోనూ ఇండియాకు ఓటమి తప్పలేదు.

272 రన్స్‌ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇండియా మొదట్లోనే కష్టాల్లో పడింది. రోహిత్‌ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన విరాట్ కోహ్లి (6) ఇబాదత్‌ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. ఆ వెంటనే మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (8) కూడా ముస్తఫిజుర్‌ రెహమాన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 రన్స్‌కే ఓపెనర్లిద్దరూ పెవిలియన్‌ చేరారు. ఆ తర్వాత వాషింగ్టన్‌ సుందర్‌ (11), కేఎల్‌ రాహుల్‌ (14) కూడా నిరాశ పరిచారు.

దీంతో ఇండియా 65 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో శ్రేయస్‌ అయ్యర్‌, అక్షర్‌ పటేల్‌ ఇన్నింగ్స్‌ను మళ్లీ గాడిలో పెట్టారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 107 రన్స్‌ జోడించారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేశారు. ఈ సమయంలో ఇండియాకు మ్యాచ్‌పై ఆశలు రేగాయి. అయితే 83 రన్స్‌ దగ్గర శ్రేయస్‌ భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటవడంతో ఐదో వికెట్‌ పడింది.

ఆ వెంటనే 56 రన్స్‌ చేసిన అక్షర్‌ పటేల్‌ కూడా ఔటయ్యాడు. దీంతో ఇండియన్‌ టీమ్‌ మళ్లీ కష్టాల్లో పడింది. ఆ తర్వాత శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చహర్‌, సిరాజ్‌లాంటి వాళ్లు కూడా విఫలమయ్యారు. సిరాజ్‌ అయితే 48వ ఓవర్‌లో ఒక్క పరుగూ చేయకపోవడంతో రోహిత్‌పై ఒత్తిడి పెరిగింది. అయినా అతడు చివరి బంతి వరకూ పోరాడినా ఫలితం లేకపోయింది.

మెహదీ సెంచరీ

అంతకుముందు బంగ్లాదేశ్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 271 రన్స్‌ చూసింది. ఒక దశలో 69 రన్స్‌కే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన బంగ్లాను మెహదీ హసన్‌, మహ్మదుల్లా ఆదుకున్నారు. తొలి వన్డేలో టీమ్‌కు అద్భుత విజయం సాధించి పెట్టిన మెహదీ హసన్‌ ఈ మ్యాచ్‌లో 83 బాల్స్‌లోనే సెంచరీ చేశాడు.

అంతేకాదు మహ్మదుల్లాతో కలిసి ఏడో వికెట్‌కు 148 రన్స్‌ జోడించి బంగ్లాదేశ్‌కు మంచి స్కోరు సాధించి పెట్టాడు. మహ్మదుల్లా 96 బాల్స్‌లో 77 రన్స్‌ చేసి ఔటయ్యాడు. మొదట్లో చెలరేగి తర్వాత చేతులెత్తేసే సంప్రదాయాన్ని ఇండియన్‌ బౌలర్లు ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించారు. వాషింగ్టన్‌ సుందర్‌ 3, ఉమ్రాన్‌, సిరాజ్‌ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి వన్డేల్లో సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా మెహదీ హసన్‌ నిలిచాడు. వన్డేల్లో అతనికిదే తొలి సెంచరీ కావడం విశేషం. అంతేకాదు అతడు చివర్లో చెలరేగి తన టీమ్‌కు చివరి ఐదు ఓవర్లలో ఏకంగా 68 రన్స్‌ చేసి పెట్టాడు. దీంతో 69/6 నుంచి బంగ్లాదేశ్‌ 271/7కు చేరింది. తర్వాత చేజింగ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ గాయపడటంతో ధావన్‌తో కలిసి కోహ్లి ఓపెనింగ్‌కు దిగాడు.

Whats_app_banner