Rafael Nadal Injury: మానసికంగా పూర్తిగా దెబ్బతిన్నాను: షాకింగ్ ఓటమి తర్వాత నదాల్
18 January 2023, 16:43 IST
- Rafael Nadal Injury: మానసికంగా పూర్తిగా దెబ్బతిన్నానంటూ ఆస్ట్రేలియన్ ఓపెన్ లో షాకింగ్ ఓటమి తర్వాత రఫేల్ నదాల్ అన్నాడు. అతడు రెండో రౌండ్ లోనే ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే.
ఓటమి బాధలో రఫేల్ నదాల్
Rafael Nadal Injury: స్పెయిన్ బుల్, ఆస్ట్రేలియన్ ఓపెన్ డిఫెండింగ్ ఛాంపియన్ రఫేల్ నదాల్ రెండో రౌండ్ లోనే ఓటమి పాలయ్యాడు. అతడు అమెరికాకు చెందిన మెకంజీ మెక్‌డొనాల్డ్ చేతిలో 4-6, 4-6,5-7 తేడాతో వరుస సెట్లలో ఓడిపోయాడు. ఈ మ్యాచ్ మధ్యలోనే తుంటి గాయానికి గురైన నదాల్.. గెలుపు కోసం ప్రయత్నించలేకపోయాడు.
గతంలో తనను ఇబ్బంది పెట్టిన తుంటి గాయమే మరోసారి నదాల్ కొంప ముంచింది. గతేడాది మొత్తం అతడు గాయాల కారణంగా ఇబ్బంది పడ్డాడు. "అది కండరాల గాయమా లేక జాయింట్ లలో సమస్యా అన్నది తెలియడం లేదు. తుంటి సమస్య గతంలోనూ ఉంది. దీనికి చికిత్స కూడా తీసుకున్నాను. కానీ ఇప్పుడు సమస్య తీవ్రంగా ఉంది. నేను కదల్లేకపోతున్నాను" అని నదాల్ చెప్పాడు.
ఈ మ్యాచ్ లో అతడు ఇబ్బంది పడుతూనే ఆడాడు. సెట్ బ్రేక్ లో చాలా సేపు చికిత్స కోసం వెళ్లాడు. అయినా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఇలా గాయంతో రిటైర్ కావాలని తాను అనుకోలేదని నదాల్ చెప్పాడు. "రిటైర్మెంట్ తో కోర్టును వీడాలని నేను అనుకోలేదు. ఇలా ఓడిపోయినా సరే అనుకున్నాను. నేను ఓడిపోయాను. ఇంక చెప్పేదేమీ లేదు. ప్రత్యర్థికి శుభాకాంక్షలు. కొన్నిసార్లు ఇది అంగీకరించడం కష్టం. గాయాల వల్ల కొన్నిసార్లు చాలా అలసిపోయినట్లు అనిపిస్తుంది. నేను మానసికంగా పూర్తిగా దెబ్బతిన్నాను" అని నదాల్ చెప్పాడు.
గతేడాది యూఎస్ ఓఫెన్ నాలుగో రౌండ్లో ఇంటిదారి పట్టిన తర్వాత 8 మ్యాచ్ లు ఆడిన నదాల్ ఆరింట్లో ఓడిపోయాడు. 2022లో పక్కటెముకల గాయం, కాలి గాయం, పొట్ట భాగంలో సమస్యతో నదాల్ ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు తుంటి గాయంతో మరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్లోనే నదాల్ ఇంటిదారి పట్టాడు.
"ఇది చాలా సింపుల్. నేను చేసే పనిని ఇష్టపడుతున్నాను. నాకు టెన్నిస్ ఆడటం ఇష్టం. ఇది ఎప్పటికీ ఆడనని తెలుసు. కాంపిటీటీవ్ గా ఉండటానికి ప్రయత్నిస్తాను. నా సగం జీవితంలో నేను దేని కోసమైతే ఫైట్ చేస్తున్నానో దాని కోసం ఫైట్ చేయడం ఇష్టం. గాయాలు నిరాశ కలిగిస్తూనే ఉన్నాయి. అయినా వీటిని అధిమిస్తాను" అని నదాల్ స్పష్టం చేశాడు.