తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Australian Open 2023 Draw: జోకొవిచ్‌, కిర్గియోస్‌ ఒకే క్వార్టర్‌లో.. నదాల్‌కు సవాల్‌.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ డ్రా రిలీజ్‌

Australian Open 2023 draw: జోకొవిచ్‌, కిర్గియోస్‌ ఒకే క్వార్టర్‌లో.. నదాల్‌కు సవాల్‌.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ డ్రా రిలీజ్‌

Hari Prasad S HT Telugu

12 January 2023, 14:23 IST

google News
    • Australian Open 2023 draw: జోకొవిచ్‌, కిర్గియోస్‌ ఒకే క్వార్టర్‌లో ఉన్నారు. టాప్‌ సీడ్‌ రఫేల్‌ నదాల్‌కు సవాల్‌ ఎదురు కానుంది. తాజాగా సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ అయిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ డ్రాను నిర్వాహకులు రిలీజ్‌ చేశారు
నొవాక్ జోకొవిచ్
నొవాక్ జోకొవిచ్ (AFP)

నొవాక్ జోకొవిచ్

Australian Open 2023 draw: ఒక ఏడాదిలో జరిగే నాలుగు టెన్నిస్‌ గ్రాండ్‌స్లామ్‌లలో మొదటిది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌. ప్రతి ఏటా జనవరిలో జరిగే ఈ టోర్నీకి టైమ్‌ దగ్గర పడింది. దీంతో గురువారం (జనవరి 12) ఈ గ్రాండ్‌స్లామ్‌ డ్రాను ఆర్గనైజర్లు రిలీజ్‌ చేశారు. రికార్డు స్థాయిలో పదో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌పై కన్నేసిన సెర్బియన్‌ సెన్సేషన్‌ నొవాక్‌ జోకొవిచ్‌.. తొలి రౌండ్‌లో స్పెయిన్‌కు చెందిన రాబర్టో కార్బాలెస్‌తో తలపడనున్నాడు.

ఆస్ట్రేలియా లోకల్‌ స్టార్‌ నిక్‌ కిర్గియోస్‌తో కలిసి జోకొవిచ్‌ ఒకే క్వార్టర్‌లో ఉన్నాడు. దీంతో క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌ జోకొవిచ్‌, కిర్గియోస్‌ మధ్య జరిగే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు కిర్గియోస్‌ మాత్రం తొలి రౌండ్‌లో సఫియులిన్‌తో ఆడనున్నాడు. అంతకుముందు జోకొవిచ్‌తోనే కిర్గియోస్‌ మెల్‌బోర్న్‌ పార్క్‌లో ఓ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ ఆడటానికి సిద్ధమవుతున్నాడు.

గతేడాది కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకోని కారణంగా ఆస్ట్రేలియా నుంచి జోకొవిచ్‌ను తిరిగి స్వదేశానికి పంపించేశారు. దీంతో తన ఫేవరెట్‌ గ్రాండ్‌స్లామ్‌ ఆడకుండానే అతడు ఇంటికెళ్లిపోయాడు. అయితే ఈసారి మాత్రం అతడు ఫేవరెట్స్‌లో ఒకడిగా బరిలోకి దిగుతున్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన తర్వాత అడిలైడ్‌ ఇంటర్నేషనల్‌ టైటిల్‌ను నొవాక్‌ గెలుచుకున్నాడు.

అటు ఈ గ్రాండ్‌స్లామ్‌లో టాప్‌ సీడ్‌గా బరిలోకి దిగుతున్న స్పెయిన్‌ బుల్ రఫేల్‌ నదాల్‌కు కాస్త కఠినమైన డ్రా ఎదురైంది. అతడు క్వార్టర్‌ఫైనల్లో మెద్వెదెవ్‌తో పోటీ పడాల్సి రావచ్చు. 2022లో గాయాలతో సతమతమైన నదాల్‌.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ తొలి రౌండ్‌లోనూ బ్రిటన్‌కు చెందిన జాక్‌ డ్రేపర్‌ రూపంలో సవాలు ఎదురు కానుంది. గతేడాది మెద్వెదెవ్‌ను ఓడించి నదాల్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలిచాడు. ఈసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నుంచి వరల్డ్‌ నంబర్‌ 1 కార్లోస్‌ అల్కరాజ్‌, మాజీ యూఎస్‌ ఓపెన్‌ ఛాంపియన్‌ మారిన్‌ సిలిచ్‌లు దూరమయ్యారు.

తదుపరి వ్యాసం