Australian Open 2023 Prize Money: భారీగా పెరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 ప్రైజ్‌మనీ.. విన్నర్‌కు ఎంతంటే?
29 December 2022, 14:46 IST
- Australian Open 2023 Prize Money: భారీగా పెరిగింది ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 ప్రైజ్‌మనీ. విన్నర్‌కు ఇచ్చే ప్రైజ్‌మనీతోపాటు మొత్తంగా టోర్నీ ప్రైజ్‌మనీ గతేడాదితో పోలిస్తే 3.4 శాతం ఎక్కువగా ఉండటం విశేషం.
జనవరి 16 నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియన్ ఓపెన్
Australian Open 2023 Prize Money: ప్రతి ఏటా జరిగే టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో మొదట జరిగేది ఆస్ట్రేలియన్ ఓపెన్. ఈసారి ఈ టోర్నీ ప్రైజ్‌మనీ మొత్తం 7.65 కోట్ల డాలర్లుగా నిర్ణయించారు. 2022 ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో పోలిస్తే ఇది 3.4 శాతం ఎక్కువ. జనవరి 16 నుంచి ప్రారంభం కాబోయే ఈ గ్రాండ్‌స్లామ్‌లో ప్రైజ్‌మనీ పెరగడంతోపాటు ప్లేయర్స్‌కు కొత్త సర్వీసులు, వసతులు కూడా నిర్వాహకులు కల్పించనున్నారు.
ఇక కొత్తగా పెంచిన ప్రైజ్‌మనీలో ఎక్కువగా తొలి రౌండ్లలో ఇంటిదారి పట్టే వాళ్లకే ప్రైజ్‌మనీని మరింత పెంచడం విశేషం. పెద్దగా పేరు లేని ప్లేయర్స్ ఈ ప్రైజ్‌మనీని ఉపయోగించి తమ కెరీర్లను నిర్మించుకోవాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు వెల్లడించారు.
ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలు ఒక్కొక్కరికి 29.75 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు. రన్నరప్‌కు 16.25 లక్షల డాలర్లు దక్కుతాయి. తొలి రౌండ్‌కు చేరుకునే ప్లేయర్స్ ఒక్కొక్కరికి 1.06 లక్షల డాలర్లు ఇవ్వనుండగా.. క్వాలిఫయింగ్‌లో చివరి రౌండ్ చేరుకునే ప్లేయర్స్ ఒక్కొక్కరికి 55,150 డాలర్లు దక్కుతాయి.
ఇక పురుషుల, మహిళల డబుల్స్ విజేతలకు 6.95 లక్షల డాలర్లు ప్రైజ్‌మనీగా ఇవ్వనున్నారు. మిక్స్ డబుల్స్ విజేతలకు ఈ ప్రైజ్‌మనీ 1,57,750 డాలర్లుగా ఉంది. 2003 నుంచి ఇప్పటి వరకూ ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రైజ్‌మనీ 321 శాతం పెరగడం గమనార్హం. 2003లో 1.81 కోట్ల డాలర్లుగా ఉన్న ప్రైజ్‌మనీ ఇప్పుడు ఏకంగా 7.65 కోట్ల డాలర్లకు చేరింది.
ప్రైజ్‌మనీలో పెరుగుదలే కాకుండా.. ప్లేయర్ రీఛార్జ్ జోన్‌ను కొత్తగా ఏర్పాటు చేశారు. ప్లేయర్స్ కోసం ప్రత్యేకంగా ఆరు థీమ్‌లతో కూడిన రెస్టారెంట్లు ఉంటాయి. ఇక ప్లేయర్స్ తమ మ్యాచ్‌ల విశ్లేషణ డేటాను కూడా పొందే వీలు కల్పించారు.
టాపిక్