తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Pujara On Indore Test: ఈ టార్గెట్ సరిపోదు.. పుజారా నిరాశ

Pujara on Indore Test: ఈ టార్గెట్ సరిపోదు.. పుజారా నిరాశ

Hari Prasad S HT Telugu

02 March 2023, 18:25 IST

google News
    • Pujara on Indore Test: ఈ టార్గెట్ సరిపోదు అంటూ ఇండోర్ టెస్ట్ పై చెతేశ్వర్ పుజారా నిరాశ వ్యక్తం చేశాడు. ఇండియా రెండో ఇన్నింగ్స్ లోనూ కేవలం 163 రన్స్ మాత్రమే చేయడంతో ఆస్ట్రేలియా ముందు 76 పరుగుల లక్ష్యం ఉంది.
చెతేశ్వర్ పుజారా
చెతేశ్వర్ పుజారా (AFP)

చెతేశ్వర్ పుజారా

Pujara on Indore Test: ఆస్ట్రేలియాను తొలి రెండు టెస్టుల్లో స్పిన్ తో చుట్టేసి మూడు రోజుల్లోనే ముగించిన టీమిండియా.. ఇప్పుడు మూడో టెస్టులో తానే మూడు రోజుల్లో చేతులెత్తేసేలా ఉంది. తొలి రోజు తొలి సెషన్ నుంచే స్పిన్ కు అనుకూలిస్తున్న ఇండోర్ పిచ్ పై రెండో రోజు ముగిసే సమయానికే మూడు ఇన్నింగ్స్ ముగిసిపోయాయి.

తొలి రోజు 14 వికెట్లు పడగా.. రెండో రోజు 16 వికెట్లు నేలకూలాయి. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 197 పరుగులకు ఆలౌట్ కావడంతో 88 పరుగుల ఆధిక్యం సంపాదించింది. తర్వాత పుజారా హాఫ్ సెంచరీతో ఇండియా రెండో ఇన్నింగ్స్ లో 163 పరుగులు చేసింది. దీంతో ఓవరాల్ గా 75 పరుగుల ఆధిక్యం మాత్రమే లభించింది. ఆస్ట్రేలియా ముందు 76 పరుగుల లక్ష్యం ఉండగా.. మూడో రోజు తొలి సెషన్ లోనే మ్యాచ్ ముగిసేలా కనిపిస్తోంది.

ఈ టార్గెట్ సరిపోదు

అయితే ఈ చిన్న లక్ష్యంపై పుజారా నిరాశ వ్యక్తం చేశాడు. ఈ టార్గెట్ సరిపోదని, అయితే ఓ చిన్న అవకాశం అయితే ఉందని అతడు రెండో రోజు ఆట ముగిసిన తర్వాత అన్నాడు. "ఈ పిచ్ పై బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. అంత సులువు కాదు. మీ డిఫెన్స్ పై నమ్మకం ఉండాలి. కాస్త ముందుకు వెళ్లి ఆడాలి. ఒకవేళ బంతి షార్ట్ పిచ్ అయితే బ్యాక్ ఫుట్ పై ఆడాలి. 75 చాలా తక్కువ. కానీ చిన్న అవకాశమైతే ఉంది" అని పుజారా అన్నాడు.

"ఈ పిచ్ పై డిఫెన్స్ ఆడాలి, అటాక్ కూడా చేయాలి. మొత్తం డిఫెన్స్ ఆడితే ఓ బంతి బౌన్స్ అయి నేరుగా గ్లోవ్ కు తగిలే అవకాశం ఉంది. ఎన్ని వీలైతే అన్ని పరుగులు చేయాలని నేను భావించాను. అక్షర్ తో కలిసి మరిన్ని పరుగులు జోడించి ఉంటే కథ వేరేలా ఉండేది" అని పుజారా చెప్పాడు.

రెండో ఇన్నింగ్స్ లో పుజారా మాత్రమే కాస్త ఫర్వాలేదనిపించాడు. దీనికోసం తాను తన మెథడ్ లో మార్పులు చేసినట్లు తెలిపాడు. "అవసరమైతే నేను మరిన్ని ట్రిక్స్ నేర్చుకుంటాను. మరీ ఎక్కువ డాట్ బాల్స్ ఆడదలచుకోలేదు. కొన్ని అవకాశాలు తీసుకుంటే.. పరుగులు చేయొచ్చు. ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు షాట్లు ఆడే కాన్ఫిడెన్స్ నాకు ఉంది" అని పుజారా అన్నాడు.

తదుపరి వ్యాసం