Pakistan Cricket Team: వన్డేల్లో పాకిస్థాన్ అరుదైన రికార్డు.. ఇండియా, ఆస్ట్రేలియా తర్వాత ఆ టీమే
28 April 2023, 16:40 IST
- Pakistan Cricket Team: వన్డేల్లో పాకిస్థాన్ అరుదైన రికార్డు సాధించింది. ఇప్పటి వరకూ ఇండియా, ఆస్ట్రేలియాలకు మాత్రమే సాధ్యమైన ఆ లిస్టులో తాజాగా పాక్ కూడా చేరింది.
పాకిస్థాన్ క్రికెట్ టీమ్
Pakistan Cricket Team: వన్డే క్రికెట్ లో పాకిస్థాన్ టీమ్ ఓ అరుదైన రికార్డును తన పేరిట రాసుకుంది. న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో 5 వికెట్లతో గెలిచిన పాక్.. రికార్డు బుక్కుల్లోకి ఎక్కింది. ఇప్పటి వరకూ ఇండియా, ఆస్ట్రేలియా టీమ్స్ కు మాత్రమే సాధ్యమైన రికార్డును ఇప్పుడు పాకిస్థాన్ కూడా అందుకోవడం విశేషం. వన్డేల్లో పాకిస్థాన్ కు ఇది 500వ విజయం కావడం విశేషం.
పాకిస్థాన్ తన 949వ వన్డే మ్యాచ్ లో ఈ ఘనతను సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ తో మ్యాచ్ లో 289 పరుగులు లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి మరో 9 బంతులు మిగిలి ఉండగానే పాక్ చేజ్ చేసింది. వన్డేల్లో అత్యధిక విజయాల లిస్టు చూస్తే.. 594 విజయాలతో ఆస్ట్రేలియా తొలి స్థానంలో ఉండగా.. ఇండియా 539 విజయాలతో రెండోస్థానంలో ఉంది.
1973, ఫిబ్రవరిలో పాకిస్థాన్ తన తొలి వన్డే ఆడింది. ఆ మ్యాచ్ లో పాక్ ఓడిపోయింది. 1974, ఆగస్టులో ఇంగ్లండ్ తో రెండో వన్డే ఆడిన పాక్.. తన తొలి విజయాన్ని అందుకుంది. తొలి వన్డే ఆడిన 50 ఏళ్ల తర్వాత పాక్.. తన 500వ విజయం సాధించడం విశేషం. తాజాగా న్యూజిలాండ్ తో మ్యాచ్ విజయంలో ఓపెనర్ ఫఖర్ జమాన్ కీలకపాత్ర పోషించాడు.
అతడు సెంచరీ చేశాడు. 114 బంతుల్లోనే 117 పరుగులు చేయడంతో పాక్ సులువుగా గెలిచింది. ఇమాముల్ హక్ 60 రన్స్ చేశాడు. కెప్టెన్ బాబర్ ఆజం 49 రన్స్ చేసి ఔటయ్యాడు. అంతకుముందు డారిల్ మిచెల్ (113) సెంచరీ, విల్ యంగ్ (86) హాఫ్ సెంచరీతో న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 288 రన్స్ చేసింది. ఇప్పటికే న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు ఈ ఏడాది చివర్లో ఇండియాలో జరగబోయే వన్డే వరల్డ్ కప్ కు నేరుగా అర్హత సాధించాయి.
న్యూజిలాండ్ టీమ్ ప్రస్తుతం కొనసాగుతున్న ఐసీస మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ సూపర్ లీగ్ సైకిల్లో టాప్ లో ఉంది. ఆ టీమ్ 24 మ్యాచ్ లలో 16 గెలిచింది. ఇక పాకిస్థాన్ టీమ్ 21 మ్యాచ్ లలో 13 విజయాలతో ఐదో స్థానంలో ఉంది.