Pakistan Cricket: వరల్డ్ కప్ గెలిచే సత్తా పాకిస్థాన్‌కు ఉంది: డైరెక్టర్ మిక్కీ ఆర్థర్
Pakistan Cricket: వరల్డ్ కప్ గెలిచే సత్తా పాకిస్థాన్‌కు ఉందని ఆ టీమ్ కొత్త డైరెక్టర్ మిక్కీ ఆర్థర్ అన్నాడు. ఈ మధ్యే అతడు కొత్త డైరెక్టర్ గా ఏడాది కాలానికి పాక్ క్రికెట్ బోర్డుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ టీమ్ కోసం కొత్త డైరెక్టర్ ను నియమించింది. ఆ జట్టుకు గతంలో కోచ్ గా పని చేసిన మిక్కీ ఆర్థర్ నే మరోసారి డైరెక్టర్ గా తీసుకొచ్చింది. 2016 నుంచి 2019 వరకు అతడు పాక్ టీమ్ హెడ్ కోచ్ గా ఉన్నాడు. ఇక ఇప్పుడు డైరెక్టర్ గా వచ్చిన ఆర్థర్.. పాకిస్థాన్ టీమ్ కు వరల్డ్ కప్ గెలిచే సత్తా ఉందని అనడం విశేషం. అంతేకాదు ఆ టీమ్ అన్ని ఫార్మాట్లలోనూ నంబర్ వన్ కాగలదనీ అన్నాడు.
"గత ఐదేళ్లుగా పాకిస్థాన్ ఆడిన ప్రతి మ్యాచ్ ను నేను టీవీలో చూశాను. నాకు ప్లేయర్స్ గురించి బాగా తెలుసు. వాళ్లు ఏమనుకుంటున్నారో కూడా నాకు తెలుసు" అని ఆర్థర్ చెప్పాడు. 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇండియాను పాకిస్థాన్ ఓడించిన సమయంలోనూ ఆర్థరే ఆ టీమ్ హెడ్ కోచ్ గా ఉన్నాడు.
"పాకిస్థాన్ మా రక్తంలోనే ఉంది అంటుంటారు. నిజమే అది మన రక్తంలోనే ఉంటుంది. నేను ఈ జట్టుతో బాగా కనెక్ట్ అయ్యాను. ఈ దేశంతోనే అలాంటి బంధమే ఉంది. ఇది నాకు గొప్ప గౌరవం. ఇక్కడికి తిరిగి రావడం, వాళ్లకు సాయం చేయడం. వరల్డ్ కప్ గెలవడంతోపాటు అన్ని ఫార్మాట్లలోనూ నంబర్ వన్ గా ఎదగాలని అనుకుంటున్నాను. నిజానికి ఆ టాలెంట్ ఉంది" అని ఆర్థర్ అన్నాడు.
ఇక కెప్టెన్ బాబర్ ఆజంపై కూడా అతడు ప్రశంసలు కురిపించాడు. నెట్స్ లో బాబర్ బ్యాటింగ్ తనను ఎంతగానో ఆకర్షించిందని చెప్పాడు. "అతడు జట్టులో ముఖ్యమైన భాగం అవుతాడని తెలుసు. ప్రస్తుతం అతడే నంబర్ వన్ బ్యాటర్. అతడో అద్భుతమైన టాలెంట్. అతడు ఇంకా మెరుగయ్యే అవకాశం ఉంది. నేను అతనికి సవాలు విసురుతూనే ఉంటాను. అతడు గేమ్ లో ఓ లెజెండ్ అవుతాడు" అని ఆర్థర్ స్పష్టం చేశాడు.
సంబంధిత కథనం