తెలుగు న్యూస్  /  Sports  /  New Zealand Vs Sri Lanka As Kane Williamson Win It For Kiwis On The Final Ball Of The Test

New Zealand vs Sri Lanka: చివరి బంతికి విలియమ్సన్ సింగిల్.. లంకను ఓడించిన న్యూజిలాండ్.. వీడియో చూశారా?

Hari Prasad S HT Telugu

13 March 2023, 15:09 IST

    • New Zealand vs Sri Lanka: చివరి బంతికి విలియమ్సన్ సింగిల్ తీయడంతో లంకను ఓడించింది న్యూజిలాండ్. ఈ థ్రిల్లింగ్ టెస్ట్ విక్టరీకి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
చివరి బంతికి న్యూజిలాండ్ ను గెలిపించిన కేన్ విలియమ్సన్
చివరి బంతికి న్యూజిలాండ్ ను గెలిపించిన కేన్ విలియమ్సన్ (AFP)

చివరి బంతికి న్యూజిలాండ్ ను గెలిపించిన కేన్ విలియమ్సన్

New Zealand vs Sri Lanka: ఈ టీ20 క్రికెట్ యుగంలో చివరి బంతికి విజయాలు సాధారణమే. కానీ ఓ టెస్ట్ మ్యాచ్ చివరి రోజు చివరి బంతికి పరుగు తీసి గెలిచిన సందర్భాలు మీరు ఎన్ని చూశారు? అత్యంత అరుదుగా వచ్చే సందర్భాలు ఇవి. తాజాగా సోమవారం (మార్చి 13) శ్రీలంకపై తొలి టెస్టులో న్యూజిలాండ్ గెలిచింది కూడా ఇలాగే.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వీరోచిత సెంచరీ చేయడంతోపాటు చివరి బంతికి విజయానికి అవసరమైన సింగిల్ తీసి న్యూజిలాండ్ ను 2 వికెట్లతో గెలిపించాడు. అది నరాలు తెగే ఉత్కంఠ మధ్య తీసిన సింగిల్. నిజానికి బంతి వికెట్ కీపర్ చేతుల్లో పడినా.. నాన్ స్ట్రైకర్ పరుగెత్తుకొని రావడంతో విలియమ్సన్ అవతలి వైపు పరుగెత్తాడు.

స్ట్రైకింగ్ ఎండ్ లో వికెట్ కీపర్ వికెట్లను మిస్ చేసినా.. ఆ బంతిని అందుకున్న బౌలర్ నాన్ స్ట్రైకర్ వైపు వికెట్లను గురి చూసి కొట్టాడు. ఇది రనౌటేమో.. మ్యాచ్ డ్రాగా ముగిసిందని అందరూ అనుకున్నారు. కానీ తన వీరోచిత సెంచరీలాగే.. ఈ పరుగు కోసం కూడా విలియమ్సన్ డైవ్ చేసి క్రీజులోకి వచ్చేశాడు. దీంతో న్యూజిలాండ్ 2 వికెట్ల తేడాతో లంకను ఓడించి రెండు టెస్టుల సిరీస్ లో 1-0 లీడ్ సాధించింది.

శ్రీలంక ఓటమితో ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరింది. ఈ మ్యాచ్ జూన్ 7న ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. దీనికి కారణమైన విలియమ్సన్ కు భారత అభిమానులు థ్యాంక్స్ చెబుతున్నారు.

చివరి ఓవర్ ఇలా..

ఈ మ్యాచ్ విజయానికి న్యూజిలాండ్ కు చివరి ఓవర్లో 8 పరుగులు అవసరమయ్యాయి. చేతిలో మూడు వికెట్లు ఉన్నాయి. అయితే చివరి 3 బంతులకు 5 పరుగులు అవసరమైన సమయంలో మ్యాట్ హెన్రీ రనౌటయ్యాడు. ఆ తర్వాతి బంతికి విలియమ్సన్ ఫోర్ కొట్టాడు. రెండు బంతుల్లో ఒక పరుగు చేస్తే చాలనుకున్న సమయంలో బౌలర్ అసిత ఫెర్నాండో ఐదో బంతి బౌన్సర్ వేయడంతో రన్ రాలేదు.

దీంతో చివరి బంతికి పరుగు చేస్తేనే విజయం దక్కే పరిస్థితి ఎదురైంది. చివరి బంతి కూడా ఫెర్నాండో బౌన్సర్ గా వేయడంతో విలియమ్సన్ దానిని అందుకోలేకపోయాడు. అయితే నాన్ స్ట్రైకర్ గా ఉన్న నీల్ వాగ్నర్ అలాగే రన్ కోసం వచ్చేశాడు. విలియమ్సన్ కూడా పరుగెత్తికెళ్లి డైవ్ చేశాడు. చివరికి అతడు 121 పరుగులతో అజేయంగా నిలిచాడు.

టెస్టుల్లో విలియమ్సన్ కు ఇది 27వ సెంచరీ. ఓటమి వైపు సాగుతున్న తన జట్టును అద్భుతంగా ఆదుకోవడమే కాదు చివరికి గెలిపించాడు. ఈ మధ్యే ఇంగ్లండ్ పై కూడా విలియమ్సన్ ఇలాగే రెండో ఇన్నింగ్స్ లో ఫైటింగ్ సెంచరీతో గెలిపించిన విషయం తెలిసిందే.