IPL 2022 | ముంబై ఇండియన్స్ ఖాతాలో మరో చెత్త రికార్డు...
22 April 2022, 12:03 IST
గురువారం చెన్నై సూపర్‌కింగ్స్ చేతిలో ఓటమిపాలైన ముంబై ఇండియన్స్ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నది. ఈ ఓటమితో ముంబై ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు కనుమరుగైపోయాయి.
ముంబై ఇండియన్స్
వరుస పరాజయాలతో ఐపీఎల్ 2022లో డీలా పడ్డ ముంబై ఇండియన్స్ ఖాతాలో మరో చెత్త రికార్డు చేరింది. ఐపీఎల్ చరిత్రలో వరుసగా ఏడు మ్యాచ్‌లు ఓడిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. గురువారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో విజయాన్ని సాధించి బోణీ కొట్టాలని ముంబై భావించింది. కానీ లాస్ట్ బాల్ కు ఫోర్ కొట్టి ధోనీ చెన్నైని గెలిపించాడు. ఈ సీజన్‌లో ముంబైకి ఇది ఏడో పరాజయం కావడం గమనార్హం. 2013లో ఢిల్లీ క్యాపిటల్స్,2019లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ వరుసగా ఆరు మ్యాచుల్లో ఓడిపోయాయి.
చెన్నైతో జరిగిన మ్యాచ్ తో వాటి రికార్డును ముంబై తిరగరాసింది. ఎప్పటికీ చెరిగిపోలేని చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నది. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ముంబై బ్యాట్స్‌మెన్స్ పూర్తిగా విఫలమయ్యారు. హైదరాబాద్ ఆటగాడు తిలక్‌వర్మ మినహా ఎవరూ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. చివరి ఓవర్‌లో చెన్నై విజయానికి పదిహేడు పరుగులు అవసరం కాగా జయదేవ్ ఉనద్కత్ లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయలేకపోయాడు. ఈ ఓటమితో ముంబై ప్లేఆఫ్ అవకాశాలు దాదాపు దూరమయ్యాయి. ఇంటిదారిపట్టడం ఖాయమైంది. మిగిలిన మ్యాచ్‌లలోనైనా గెలిచి కనీసం పరువు అయిన నిలబెట్టుకోవాలని ముంబై భావిస్తున్నట్లు తెలిసింది.