Cricket | రమీజ్ రజా ప్రతిపాదనను తిరస్కరించిన ఐసీసీ
11 April 2022, 14:06 IST
ఇండియా, పాకిస్థాన్ తో పాటు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య ప్రతి ఏటా ఓ సిరీస్ నిర్వహించాలనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ రమీజ్ రజా ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించింది. ఇటీవల రెండు రోజుల పాటు దుబాయ్ లో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు.
రమీజ్ రజా
చిరకాల ప్రత్యర్థులు ఇండియా పాకిస్థాన్ తలపడితే చూడాలనే ప్రతి క్రికెట్ అభిమాని కోరుకుంటాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రజా కూడా అదే ఆశపడ్డాడు. ఇండియా, పాకిస్థాన్ తో పాటు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లతో ప్రతి ఏటా ఓ సిరీస్ నిర్వహిస్తే బాగుంటుందని ఐసీసీ ముందు ప్రతిపాదన ఉంచాడు. అతడి ప్రతిపాదనను ఐసీసీ బోర్డ్ తిరస్కరించింది.
దుబాయ్ లో రెండు రోజుల పాటు ఐసీసీ బోర్డు సమావేశాలు జరిగాయి. ఇందులో ఐసీసీ ఛైర్మన్ ఎంపికతో పాటు పలు కీలక విషయాలపై చర్చించారు. ఈ సమావేశంలో నాలుగు దేశల మధ్య సిరీస్ కారణంగా ఐదేళ్లలో 750 మిలియన్ డాలర్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని రమీజ్ రజా అభిప్రాయపడ్డారు. కానీ అతడి అభ్యర్థనకు ఐసీసీ సభ్యులు ఎవరూ మద్ధతు తెలపలేదు.
ఐసీసీ చైర్మన్ గ్రెగర్ బార్ క్లే రెండేళ్ల పదవీకాలం త్వరలో ముగియనుంది. ఈ టైమ్ పీరియడ్ ను అక్టోబర్ వరకు పెంచారు. అతడికి మరోసారి ఛైర్మన్ బాధ్యతల్ని అప్పగించడం అనుమానంగానే కనిపిస్తోంది. ఈ సమావేశంలో కొత్త ఛైర్మన్ ను ఎంపికచేయడమే మంచిదనే అభిప్రాయానికి సభ్యులు వచ్చినట్లు తెలిసింది.
ఈ సారి ఐసీసీ ఛైర్మన్ పదవికి పోటీపడబోతున్నట్లు బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీతో పాటు సెక్రటరీ జయ్ షా పేర్లు ప్రముఖంగా వినిపిస్తోంది. నవంబర్ లో ఐసీసీ చైర్మన్ నియామాకం జరుగనున్నది. ఈ నేపథ్యంలో ఎవరికి ఆ పదవి దక్కుతుందన్నది ఇప్పటికే నుంచే క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశంలో ఐసీసీ క్రికెట్ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఇందులో జయ్ షాతో పాటు మహేళ జయవర్దనేకు చోటు దక్కింది.
టాపిక్