ICC | టాప్-10 నుంచి విరాట్ కోహ్లీ ఔట్.. 18వ ర్యాంకుకు ఎగబాకిన శ్రేయాస్ అయ్యర్!
02 March 2022, 15:32 IST
- ఫిబ్రవరిలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో దుమ్మురేపిన టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ తన ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు. మరోవైపు టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ కోహ్లీ చోటు టాప్-10 నుంచి గల్లంతయ్యింది
India's Ravindra Jadeja and Shreyas Iyer during the 2nd T20 match against Sri Lanka
ICC Rankings | ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో దుమ్మురేపిన టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ తన ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు. ఏకంగా 27 స్థానాలు ఎగబాకి 18వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఫిబ్రవరిలో శ్రీలంకతో జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 3-0 తో క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ సిరీస్‌లో శ్రేయాస్ అయ్యర్ తన అటాకింగ్ బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆడిన మూడు మ్యాచుల్లోనూ మూడు అజేయ అర్థ సెంచరీలు సాధించాడు. తొలి మ్యాచ్‌లో 57 పరుగులు నాటౌట్, రెండో మ్యాచ్‌లో 74 పరుగులు నాటౌట్, ఇక మూడో మ్యాచ్‌లోనూ 73 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మొత్తంగా 174 స్ట్రైక్ రేట్‌తో 204 పరుగులతో జట్టు సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.
ఈ క్రమంలో ఐసీసీ తాజాగా రిలీజ్ చేసిన బ్యాటింగ్ ర్యాంకుల్లో శ్రేయాస్ తన కెరీర్ బెస్ట్ 18వ ర్యాంకును చేరుకున్నాడు. ఇక తన సహచర ఆటగాడు భువనేశ్వర్ కుమార్ కూడా మూడు స్థానాలు ఎగబాకి బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో 17వ స్థానానికి చేరుకున్నాడు.
ఈ సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు పాతుమ్ నిస్సాంక 75 పరుగులు చేశాడు. దీంతో అతడు కూడా ఆరు స్థానాలు ఎగబాకి తొమ్మిదవ ర్యాంకు కైవసం చేసుకొని టాప్ టెన్‌లో చోటు సంపాదించాడు. ఇదే సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ర్యాంకు టాప్ టెన్ నుంచి గల్లంతయింది. ఈ సిరీస్‌కి విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లీ 5 స్థానాలు కోల్పోయి ప్రస్తుతం 15వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.కేఎల్ రాహుల్ కూడా 4 స్థానాలు దిగజారి 10వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.
ఇక UAEకి చెందిన బ్యాటర్ ముహమ్మద్ వసీమ్ ఏకంగా బ్యాటింగ్ ర్యాంకుల్లో అందర్నీ వెనక్కి నెట్టేసి 12వ స్థానానికి ఎగబాకాడు. ఇటీవల జరిగిన ICC T20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్ Aలో ఐర్లాండ్‌తో జరిగిన ఫైనల్‌లో ముహమ్మద్ వసీమ్ 66 బంతుల్లో 112 పరుగులు చేసి తన జట్టును రాబోయే టీ20 ప్రపంచ కప్ కోసం అర్హత సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. అతడి అజేయ శతకం బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో 12వ స్థానానికి చేరుకోవడానికి సహాయపడింది. ఇప్పటివరకు UAE తరఫున ఏ ఇతర బ్యాటర్ కూడా ఇంత మంచి ర్యాంక్ సాధించలేదు. గతంలో 2017లో షైమాన్ అన్వర్ సాధించిన 13వ స్థానాన్ని వసీమ్ అధిగమించాడు.
ఇటు టెస్ట్ ర్యాంకులను కూడా ఐసీసీ విడుదల చేసింది. టీమిండియా నుంచి బౌలింగ్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రాలు తమ ర్యాంకులను నిలబెట్టుకున్నారు. అశ్విన్ 2వ ర్యాంకులో, బుమ్రా 10వ ర్యాంకులో కొనసాగుతున్నారు. వన్డే చాడుర్యాంకింగ్స్ లో బూమ్రా ఒక్కడే టీమిండియా తరఫున టాప్ టెన్ లో చోటు సంపాదించాడు. స్థానం మెరుగుపరుచుకొని 6వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.
ఇక ఆల్-రౌండర్స్ జాబితాలో టెస్ట్ క్రికెట్లో టీమిండియా నుంచి అశ్విన్, రవీంద్ర జడేజా ఎప్పట్లాగే వరుసగా 2,3 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.
టాపిక్