MS Dhoni Favorite Cricketer: సచిన్‌లా ఆడలేనని అప్పుడే తెలిసొచ్చింది. మాస్టర్‌పై ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు
14 October 2022, 18:58 IST
- MS Dhoni Favorite Cricketer: సచిన్ తెందూల్కర్ మరోసారి తన అభిమాన క్రికెటర్ ఎవరో తెలియజేశాడు. జీవితంలో సచినే తన ఐడల్ అని స్పష్టం చేశాడు. చెన్నైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
ఎంఎస్ ధోనీ
MS Dhoni Favorite Cricketer: ఇప్పుడేమో తెలియదు కానీ.. 80, 90వ దశకంలో పుట్టిన ఎవర్నైనా మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? అని అడిగితే.. తడుముకోకుండా చాలా వరకు సచిన్ తెందూల్కర్ పేరే చెబుతారు. అంతలా మన మాస్టర్ బ్లాస్టర్ ప్రజల్లో ముద్రవేశారు. సామాన్యులకే కాదు.. సెలబ్రెటీలకు సైతం ఆయనో ఐడల్. ఇందుకు భారత క్రికెటర్లు ఏం మినహాయింపు కాదు. సచిన్ తన ఫేవరెట్ క్రికెటర్ అనే ఎన్నో సందర్భాల్లో మన కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీనే చెప్పాడు. తాజాగా మరోసారి తెందూల్కర్‌పై తన అభిమానం గురించి బహిర్గత పరిచాడు. జీవితంలో సచినే తన ఐడల్ అని స్పష్టం చేశాడు.
తాజాగ చెన్నై వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మహీ.. అక్కడి విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానమిచ్చారు. ఇందులో భాగంగా మీ పేవరెట్ క్రికెటర్ ఎవరు అనే ప్రశ్నకు తడుముకోకుండా సచిన్ తెందూల్కరే అని బదులిచ్చాడు. చిన్ననాటి నుంచే అతడిని ఎంతో అభిమానించేవాడినని తెలియజేశాడు.
నేనూ మీలాగే పెరిగాను. చిన్నతనంలో సచిన్‌లా ఆడాలని కలలు కనేవాడిని. అయితే కొంతకాలానికే నాకు అర్థమైంది. నేను అతడిలా ఆడలేనని, కానీ ఎప్పటికైనా అతడిలా క్రికెటర్ అవ్వాలని మనస్సులో బలంగా ఉండేది. అతడే నా రోల్ మోడల్. అని సచిన్‌పై మరోసారి తన అభిమానాన్ని మనస్సులో నుంచి బయటకు పెట్టాడు మన మహీ. పాఠశాల సమయంలో మీ పేవరెట్ సబ్జెక్టు ఏంటి? అనే ప్రశ్నకు.. మహీ నవ్వుతూ సమాధానమిచ్చాడు. అన్నింటికంటే తనకు స్పోర్ట్స్ పీరియడ్ అంటేనే ఇష్టమని గుర్తు చేసుకున్నాడు.
మహేంద్ర సింగ్ ధోనీ 2020లో తన అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కొలు పలికాడు. అప్పటి నుంచి భారత్‌లో జరుగుతున్న ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. తన కెరీర్లో ఇప్పటి వరకు 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 4,876 పరుగులు చేయగా.. వన్డేల్లో 10,773 పరుగులు చేశాడు.