తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Lara On Warne And Muralidharan: వార్న్‌, మురళీధరన్‌.. వీళ్లలో ఎవరి బౌలింగ్‌ కష్టం.. లారా సమాధానమిదీ!

Lara on Warne and Muralidharan: వార్న్‌, మురళీధరన్‌.. వీళ్లలో ఎవరి బౌలింగ్‌ కష్టం.. లారా సమాధానమిదీ!

Hari Prasad S HT Telugu

10 January 2023, 14:58 IST

google News
    • Lara on Warne and Muralidharan: వార్న్‌, మురళీధరన్‌లలో ఎవరి బౌలింగ్‌ కష్టం? ఈ ప్రశ్నకు సమాధానమివ్వడం అంత సులువు కాదు. తాజాగా వెస్టిండీస్‌ గ్రేట్‌ బ్రియాన్‌ లారా కూడా ఈ ఇద్దరి బౌలింగ్‌లపై తనదైన విశ్లేషణ చేశాడు.
బ్రియాన్ లారా
బ్రియాన్ లారా (Twitter)

బ్రియాన్ లారా

Lara on Warne and Muralidharan: క్రికెట్‌ అంటే ఎప్పుడూ బ్యాట్‌, బాల్‌ మధ్య సమరమే. ఆ పోరులో భాగంగానే ఇప్పటి వరకూ ప్రపంచ క్రికెట్‌లో ఎంతోమంది ఆల్‌టైమ్‌ గ్రేట్‌ బౌలర్లు, బ్యాటర్లు వచ్చారు. అలాంటి ప్లేయర్స్‌లో ముత్తయ్య మురళీధరన్‌, షేన్‌ వార్న్‌, బ్రియాన్‌ లారా కూడా ఉంటారు. 1990ల్లో క్రికెట్‌ చూసిన వాళ్లు ఈ ముగ్గురి ఆటను ఎప్పటికీ మరచిపోరు.

తమ స్పిన్‌ మాయాజాలంతో మురళీధరన్‌, వార్న్‌ బ్యాటర్లను ఇబ్బంది పెట్టగా.. వాళ్ల స్పిన్‌కు సమర్థం ఎదుర్కోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండేవాడు బ్రియాన్‌ లారా. అయితే తాజాగా ఈ ఇద్దరు స్పిన్నర్లలో ఎవరి బౌలింగ్‌ ఎదుర్కోవడానికి తాను ఇబ్బంది పడ్డానన్న విషయంపై స్పందించాడతడు. అసలు స్పిన్‌ను బౌలింగ్‌ను తాను సమర్థంగా ఎదుర్కోవడానికి టెన్నిస్‌ బాల్స్‌తో ఆడటం బాగా ఉపయోగపడిందని కూడా చెప్పాడు.

"మేము టెన్నిస్‌ బాల్స్‌తో ఆడాము. నిజానికి టెన్నిస్‌ బాల్‌ను చకింగ్‌ చేయొచ్చు. సాఫ్ట్‌బాల్‌తో ఆడేటప్పుడు పిచ్‌పై గట్టిగా విసిరి బాల్‌ను చాలా దూరం స్పిన్‌ చేయొచ్చు. నా చిన్నతనంలో స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోవడం అలవాటు కావడానికి ఇది చాలా బాగా ఉపయోగపడింది. స్పిన్‌ లేదా పేస్‌ బౌలింగ్‌లో ఏది ఇష్టపడతావంటే మాత్రం కచ్చితంగా స్పిన్‌ అనే చెబుతాను. అది నాకు సహజంగా వచ్చింది" అని లారా ది టెలిగ్రాఫ్‌తో అన్నాడు.

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు హెడ్‌ కోచ్‌గా వస్తున్న లారా.. వార్న్‌, మురళీధరన్‌లతో పిచ్‌పై తన ఫైట్‌ గురించి కూడా స్పందించాడు. మొదట్లో మురళీధరన్‌ను ఎదుర్కోవడానికి తాను చాలా ఇబ్బంది పడ్డానని, అయితే తర్వాత మెల్లగా అతని బౌలింగ్ తీరును అర్థం చేసుకున్నట్లు చెప్పాడు.

"నేను ప్రతి ఇన్నింగ్స్‌ తొలి 20 నిమిషాలు మురళీ బౌలింగ్‌ను రీడ్‌ చేయలేదు. కేవలం స్వీప్‌ చేస్తూ సింగిల్స్‌ తీస్తూ స్ట్రైక్‌ నుంచి తప్పుకునేవాడిని. అయితే ఆ తర్వాత మెల్లగా అతని బౌలింగ్‌ను అర్థం చేసుకున్నాను. అప్పుడు అతడు తన బౌలింగ్‌పై కాన్ఫిడెన్స్‌ కోల్పోయినట్లు కనిపించాడు. ఇన్నింగ్స్‌ మొదట్లో మురళీని ఎదుర్కోవడం కష్టంగా అనిపించేది. తర్వాత క్రమంగా నన్ను స్ట్రైక్‌ నుంచి తప్పించి మిగతా బ్యాటర్లను ఔట్‌ చేయడానికి చూసేవాడు" అని లారా చెప్పాడు.

ఇక షేన్‌ వార్న్‌ గురించి చెబుతూ అతడు అనుభవం గడించిన కొద్దీ అతని బౌలింగ్‌ ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉండేదని లారా అన్నాడు. మొదట్లో వార్న్‌ను సులువుగా రీడ్‌ చేయగలిగినా.. తర్వాత అతడు చాలా మెరుగయ్యాడని తెలిపాడు. వార్న్‌ను పిచ్ ద్వారా కంటే అతని చేతి ద్వారానే ఎక్కువగా చదివినట్లు లారా తెలిపాడు.

"చాలా మంది పిచ్‌ ద్వారా బౌలర్‌ను చదవాలని చూస్తారు. కానీ అది చాలా ఆలస్యమవుతుంది. అందుకే నేను బౌలర్‌ చేతి నుంచి ఎలాంటి బాల్‌ వస్తుందో ముందుగానే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాడిని. వార్న్‌ను చాలా సులువుగా చదవగలిగాను. కానీ అతడు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఎప్పుడూ కొత్త కొత్త అస్త్రాలతో వచ్చి ఆశ్చర్యపరిచేవాడు" అని లారా తెలిపాడు.

టాపిక్

తదుపరి వ్యాసం