Umran Malik: వేగం ఒక్కటే సరిపోదు..ఎకానమీ రేటు తగ్గించుకోవాలి...ఉమ్రాన్ కు కపిల్ దేవ్ సూచనలు
10 June 2022, 14:14 IST
ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఆటగాళ్లలో ఉమ్రాన్ మాలిక్ ఒకరు. ఐపీఎల్ 2022లో 22 వికెట్లతో ప్రతిభను చాటుకున్నాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో ఉమ్రన్ చోటు దక్కించుకున్నాడు. అతడిపై టీమ్ ఇండియా దిగ్గజం కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఉమ్రాన్ మాలిక్
వేగంగా బౌలింగ్ చేయడమే కాకుండా వికెట్లు తీయగలిగిన నాణ్యమైన బౌలర్లు అరుదుగా కనిపిస్తుంటారని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ వ్యాఖ్యానించారు. అలాంటి వారిలో ఉమ్రాన్ మాలిక్ ఒకడని కపిల్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ ద్వారా ఉమ్రాన్ మాలిక్ వెలుగులోకి వచ్చాడు. ఈ సీజన్ లో సన్ రైజర్స్ కు ప్రాతినిథ్యం వహించిన ఉమ్రాన్ మాలిక్ 22 వికెట్లు తీశాడు. 157 కిమీ వేగంగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు.
ఐపీఎల్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకున్న సెలెక్టర్లు సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ కోసం అతడిని జట్టులోకి తీసుకున్నారు. తొలి మ్యాచ్ లో తుది జట్టులో ఆడే అవకాశం అతడికి దక్కలేదు. ఉమ్రాన్ మాలిక్ పై కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వేగంగా బౌలింగ్ చేసే చాలా మంది బౌలర్లు దేశవాళీలో కనిపిస్తారని, కానీ వారు వికెట్లు తీయడంలో విఫలమవుతున్నారని పేర్కొన్నాడు. ఉమ్రాన్ లో వేగంతో పాటు వికెట్లు తీయగల ప్రతిభ చాలా ఉందని కపిల్ అభిప్రాయపడ్డాడు.
ఈ వేగాన్ని కొనసాగించేందుకు అతడు కృషి చేస్తూనే ఉండాలని పేర్కొన్నాడు. సహచరుల నుంచి సలహాలు తీసుకోవడమే కాకుండా వారి బౌలింగ్ శైలిని పరిశీలిస్తూ తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం ఉమ్రాన్ చేయాలని కపిల్ దేవ్ సూచించాడు. కొన్ని సార్లు అతి ప్రశంసలు ఆటగాళ్ల కెరీర్ ను దెబ్బతీస్తుంటాయని కపిల్ చెప్పాడు. అలా వచ్చిన ఎందరో ఆటగాళ్లు ఏడాది లోనే తెరమరుగైపోయారని తెలిపాడు. అందుకే ఉమ్రాన్ ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నాడు.
తన బలాలు, బలహీనతలపై దృష్టిపెడుతూ బౌలింగ్ ను మెరుగుపరుచుకోవాలని తెలిపాడు. అంతర్జాతీయ స్థాయిలో అతడు రాణించాలంటే రెండు,మూడేళ్లయిన సమయం పడుతుందని చెప్పాడు అప్పటివరకు అతడికి అవకాశాలు ఇవ్వాలని అన్నాడు. 150 కిమీతో బౌలింగ్ చేస్తున్నా అతడి ఎకానమీ రేటు చాలా ఎక్కువగా ఉందని కపిల్ అన్నాడు. ఎకానమీ రేటును తగ్గించుకోవడంపై దృష్టి సారించాలని కపిల్ దేవ్ పేర్కొన్నాడు.
టాపిక్