Kapil Dev | ఇలా చేస్తే నా స్థానాన్ని భర్తీ చేస్తారు: కపిల్ దేవ్
03 May 2022, 8:07 IST
- క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ యువకులకు విలువైన సలహాను ఇచ్చారు. ఓ క్రీడా ఛానెల్‌తో ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన యువకులు ఆటపై దృష్టి పెట్టకపోతే వినోద్ కాంబ్లీలా మధ్యలోనే కెరీర్‌ను ముగించాల్సి వస్తుందని ఉదహరించారు. భారత జట్టులో తన స్థానాన్ని భర్తీ చేసే విషయంపై మాట్లాడారు.
కపిల్ దేవ్
క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్.. మరో దిగ్గజ ఆటగాడు సచిన్ తెందూల్కర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రతిభ, పట్టుదల, కఠోర శ్రమకు మాస్టర్ బ్లాస్టర్ మంచి ఉదాహరణ అని కొనియాడారు. కేవలం తన బ్యాటింగ్ రికార్డులతోనే కాకుండా.. ప్రతిభ, హార్డ్ వర్క్ వల్ల సచిన్ ఉన్నత శిఖరాలు అధిరోహించాడని, 2 దశాబ్దాలకు పైగా క్రికెట్ ప్రపంచాన్ని శాసించి లెజెండ్‌గా అవతరించాడని స్పష్టం చేశారు. మరోపక్క క్రీడాకారులు ఆటపై దృష్టి పెట్టకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వినోద్ కాంబ్లీని ఉదాహరణగా చూపారు. అంతేకాకుండా 28 ఏళ్లుగా తన స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు రాకపోవడంపై స్పందించారు.
అండర్-19 ప్రపంచకప్ ఆటగాళ్లు రాజంగద్ బవా, హర్నూర్ సింగ్‌తో కలిసి కపిల్ దేవ్ ఓ క్రీడా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
"కొన్నిసార్లు యువకులు ఇతరులను ఆకట్టుకోవడానికి ఏదైనా చేస్తుంటారు. అయితే మిమ్మల్ని మీరు ప్రేమించడం, మీకు నచ్చినదానిపై దృష్టిపెట్టడం ముఖ్యమని నేను నమ్ముతాను. నచ్చినదాని కోసం పనిచేయడం, కృషి, నిబద్ధతం లాంటి వాటికి ఎలాంటి ప్రత్యామ్నాయాలు ఉండవు. ఉదాహరణకు వినోద్ కాంబ్లీనే తీసుకోండి. అతడు చాలా మంచి ప్రతిభ కలిగిన ఆటగాడు.. ఎంతో కష్టపడి పైకి ఎదిగాడు. అయితే ఆటపై దృష్టి పెట్టాల్సిన సమయంలో ధ్యాస మళ్లింది. దీంతో కెరీర్‌ను మధ్యలోనే ముగించాడు. క్రమంగా కీర్తి ప్రతిష్టలు దూరమయ్యాయి. సచిన్ ఇందుకు విభిన్నం. ప్రతిభతో పాటు కష్టపడే తత్వం అతడిని లెజెండ్‌ను చేసింది. అందుకే మీ ప్రదర్శనే ముఖ్యం. అప్పుడే అద్భుతమైన ప్లేయర్లుగా ఎదుగుతారు. లేకుంటే ప్రజలు మిమ్మల్ని మరిచిపోతారు" అని కపిల్ దేవ్ స్పష్టం చేశారు.
కపిల్‌దేవ్ రిటైరై.. 28 ఏళ్లు పూర్తయింది. కానీ ఇంతవరకు టీమిండియా అతడి సామర్థ్యాన్ని భర్తీ చేసే ఆల్‌రౌండర్‌ను చేర్చుకోలేకపోయింది. కనీసం అతడికి చేరువలో ఉన్నవారు కూడా లేరు. ఈ విషయంపై కపిల్ స్పందించారు. "నాకు ఎక్కువగా మాట్లాడటం మీద నమ్మకం లేదు. నేను ఎప్పుడూ నా చర్యలతోనే సమాధానం చెబుతాను. ఆటపై మీకు ఎంత ఎక్కువ ఇష్టముంటే.. అంత పైకి ఎదుగుతారని, ఏదైనా సాధించగలుగుతారని నేను నమ్ముతాను. చిన్నతనం నుంచే ప్రాక్టీస్ గంటల తరబడి చేస్తుంటాను. పగలు, రాత్రి తేడా లేకుండా ఆడతాను. మీరు దేని గురించైనా ఎక్కువ ఇష్టపడినప్పుడు సమయంతో పాటు మిగతా వాటి గురించి మర్చిపోతారు." అని కపిల్ దేవ్ తెలిపారు.
టాపిక్