Kohli Counter to Naveen: పగలకు నా వద్ద టైమ్ లేదు.. నవీన్ ఉల్ హఖ్‌కు కోహ్లీ కౌంటర్
10 May 2023, 20:14 IST
- Kohli Counter to Naveen: లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు నవీన్ ఉల్ హఖ్‌కు విరాట్ కోహ్లీ కౌంటర్ వేశాడు. తన వద్ద పగలకు, ప్రతికూలతలకు టైమ్ లేదని స్పష్టం చేశాడు. సోషల్ మీడియా వేదికగా వీడియోను షేర్ చేశాడు.
విరాట్ కోహ్లీ
Kohli Counter to Naveen: విరాట్ కోహ్లీ-నవీన్ ఉల్ హఖ్ మధ్య గొడవ ఇప్పడప్పుడే తగ్గేలా లేదు. ఇటీవల ఆర్సీబీ-లక్నో మధ్య జరిగిన మ్యాచ్‌లో జరిగిన సంఘర్షణను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. లక్నో ఆటగాడు నవీన్.. ముంబయిపై బెంగళూరు ఓడటాన్ని చూపిస్తూ కోహ్లీ గురించి పరోక్షంగా ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలు పెట్టాడు. దీంతో అతడిపై విరాట్ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ పోస్టులపై మన రన్ మెషిన్ కూడా స్పందించాడు. తన ఇన్‌స్టా వేదికగా స్టోరీని పోస్ట్ చేస్తూ.. తనకు ఇలాంటి వాటికి అస్సలు టైమ్ లేదంటూ స్పష్టం చేశాడు.
ప్రముఖ హాలీవుడ్ నటుడు కెవిన్ హార్ట్ ఓ వీడియోలో మాట్లాడిన మాటలను షేర్ చేశాడు. క్షకలకు, నెగిటివిటికీ తన వద్ద అసలు టైమ్ లేదంటూ కెవిన్ హార్ట్ పేర్కొనడం ఈ వీడియోలో గమనించవచ్చు. దీంతో కోహ్లీ కూడా ప్రతికూలాంశాలను పట్టించుకునేంత తీరిక తన వద్ద కూడా లేదనే అర్థం వచ్చేలా ఈ వీడియోను షేర్ చేశాడు. దీంతో నవీన్ ఉల్ హఖ్‌కు గట్టి రిప్లయి ఇచ్చినట్లయిందని నెటిజన్లు అంటున్నారు.
"ఈ వీడియోను గమనిస్తే.. నీకు ఎన్ని ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉన్నాయనేది విషయం కాదు లేదా నువ్వు ఎంత బాధపడ్డావనేది మ్యాటర్ కాదు.. నీ జీవితంలో నువ్వు ముందుకు సాగాలి. జీవితం ఎవరికోసం ఆగిపోదు. మీరు దాన్ని ఫాలో అవ్వకుండా ఆక్కడే ఆగిపోయారని అర్థం చేసుకుంటే ఎప్పటికీ బాధపడుతూనే ఉంటారు. పగ, కోపం, నెగిటివిటీ లాంటి వాటికి నా వద్ద సమయం లేదు. ఎందుకంటే నేను పాజిటివ్ విషయాలతో జీవిస్తున్నాను. గతంలోనే కూర్చొని ఆలోచించలేను." అని కేవిన్ హార్ట్ చెప్పిన వీడియోను కోహ్లీ షేర్ చేశాడు.
మంగళవారం (మే 9) ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి కేవలం 1 పరుగుకే ఔటయ్యాడు. దీంతో అతని వైఫల్యాన్ని ఉద్దేశించి పరోక్షంగా నవీన్ తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన స్టోరీ వైరల్ అవుతోంది.దీనిపై కొందరు అభిమానులు సీరియస్ అవుతున్నారు. ఆర్సీబీ, ఎంఐ మ్యాచ్ చూస్తున్న ఫొటోను ఈ సందర్భంగా నవీన్ షేర్ చేశాడు. కోహ్లి ఔటైన తర్వాత టీవీలో మ్యాచ్ చూస్తున్న ఫొటో తీసినట్లు కనిపిస్తోంది. తన ముందు మామిడిపండ్లు పెట్టుకొని స్వీట్ మ్యాంగోస్ అనే క్యాప్షన్ అతడు ఉంచాడు. ఎక్కడా కోహ్లి గురించి మాట్లాడకపోయినా.. పరోక్షంగా అతడు విరాట్ గురించే ఈ కౌంటర్ వేసినట్లు స్పష్టమవుతోంది.