Virat Kohli : కేసీఆర్ డైలాగ్ ఫాలో అయిన కోహ్లీ.. ఇలా పగతీర్చుకుంటున్నాడు-ipl 2023 lsg vs gt virat kohli slams lucknow super giants by praising gujarat titans players ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virat Kohli : కేసీఆర్ డైలాగ్ ఫాలో అయిన కోహ్లీ.. ఇలా పగతీర్చుకుంటున్నాడు

Virat Kohli : కేసీఆర్ డైలాగ్ ఫాలో అయిన కోహ్లీ.. ఇలా పగతీర్చుకుంటున్నాడు

Anand Sai HT Telugu
May 08, 2023 11:52 AM IST

Kohli Vs Gambhir Fight : విరాట్ కోహ్లీ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఇంకా పంచాయితీ అయిపోనట్టుగా ఉంది. తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పిన డైలాగును ఫాలో అయిపోతున్నట్టుగా ఉన్నాడు విరాట్ కోహ్లీ. తాజాగా మరోసారి సోషల్ మీడియా ద్వారా లక్నో జట్టుకు పరోక్షంగా చురకలు అంటించాడు.

విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ (RCB Twitter)

'నువ్వు గోకినా గోకకపోయినా, నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా.' బీజేపీపై కామెంట్స్ చేస్తూ ఓ సందర్భంలో తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) ఈ డైలాగ్ చెప్పారు. ఇప్పుడు సేమ్ అదే డైలాగ్ ను విరాట్ కోహ్లీ ఫాలో అయిపోతున్నట్టుగా కనిపిస్తోంది. మీరు ఏం అనకున్నా.. కౌంటర్స్ వేస్తూనే ఉంటా అన్నట్టుగా ఉంది. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ లక్నో మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా పరోక్షంగా చురకలు వేశాడు కోహ్లీ.

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గంభీర్ వర్సెస్ కోహ్లీ ఫైట్ స్టార్టయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై లక్నో సూపర్ జెయింట్స్ సాధించిన విజయాన్ని చూసి సందడి చేయవద్దని ఆర్సీబీ అభిమానులకు(RCB Fans) సైగ చేశాడు గంభీర్. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్నాడు కోహ్లీ. ఆ తర్వాత ఇరు జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్‌లో కోహ్లీ సత్తా చాటాడు. ఇదే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఆటగాడు నవీన్ ఉల్ హక్‌తో కూడా గొడవపడ్డాడు. గంభీర్ సైగలు చేసినట్టుగానే.. కోహ్లీ కూడా సైగలు చేసి కౌంటర్ వేశాడు.

మహ్మద్ సిరాజ్, నవీన్ ఉల్ హక్ మధ్య జరిగిన మాటల యుద్ధంలో విరాట్ కోహ్లీ జోక్యం చేసుకున్నాడు. మ్యాచ్ సమయంలోనే కాదు, మ్యాచ్ ముగిసిన తర్వాత షేక్ హ్యాండ్ సమయంలో గొడవ జరిగింది. విరాట్ కోహ్లీ వర్సెస్ గౌతమ్ గంభీర్(Virat Kohli Vs Gautam Gambhir) ఫైట్ గట్టిగా నడిచింది. దీనిపై పలువురు కామెంట్స్ కూడా చేశారు. గొడవకు దిగిన విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్, నవీన్ ఉల్ హక్‌లకు బీసీసీఐ(BCCI) జరిమానా విధించింది. ఇంత జరిగినా గొడవ మాత్రం తగ్గినట్టుగా కనిపించడం లేదు.

మే 7న గుజరాత్ టైటాన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్(GT Vs LSG) మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో గుజరాత్ టైటాన్స్ ప్లేయర్స్ పై ప్రశంసలు కురిపించాడు. గుజరాత్ టైటాన్స్ జట్టు ఆటగాళ్ల ప్రదర్శనను ప్రశంసిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఫోటోను పంచుకోవడం ద్వారా లక్నో సూపర్ జెయింట్స్ ఓటమిని సెలబ్రేట్ చేసుకున్నట్టైంది.

గుజరాత్ టైటాన్స్ ఆటగాడు వృద్ధిమాన్ సాహా 43 బంతుల్లో 81 పరుగులు చేశాడు. దీని మీద కోహ్లీ ఇన్ స్టా స్టోరీ పెట్టాడు. ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ పట్టిన క్యాచ్‌ను మెచ్చుకుంటూ, 'నేను చూసిన అత్యుత్తమ క్యాచ్‌లలో ఇది ఒకటి' అని రాశాడు. దీని ద్వారా సోషల్ మీడియాలో పరోక్షంగా పోస్ట్ చేసి.. లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) మీద పగతీర్చుకుంటున్నాడని చర్చ నడుస్తోంది. ఎవరు గోకినా.. గోకకపోయినా.. కోహ్లీ గోకుతూనే ఉంటాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

WhatsApp channel