Naveen on kohli: ఐపీఎల్ ఆడటానికి వచ్చాను.. తిట్లు తినడానికి కాదు: నవీన్
Naveen on kohli: ఐపీఎల్ ఆడటానికి వచ్చాను.. తిట్లు తినడానికి కాదు అని విరాట్ కోహ్లితో గొడవపై నవీనుల్ హక్ తీవ్రంగా స్పందించాడు. మ్యాచ్ తర్వాత అతడు లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయర్స్ తో ఈ విషయం చెప్పాడట.
Naveen on kohli: ఐపీఎల్లో భాగంగా సోమవారం (మే 1) ఆర్సీబీ, ఎల్ఎస్‌జీ మధ్య జరిగిన మ్యాచ్ తీవ్ర దుమారం రేపిన విషయం తెలుసు కదా. ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లి.. లక్నో ప్లేయర్ నవీనుల్ హక్, ఆ టీమ్ మెంటార్ గంభీర్ తో గొడవకు దిగడం సంచలనం రేపింది. ఈ మధ్యకాలంలో ఐపీఎల్లో జరిగిన పెద్ద గొడవ ఇదే. అయితే దీనిపై తాజాగా లక్నో ప్లేయర్ నవీనుల్ హక్ స్పందించాడు.
తాను ఇండియాకు వచ్చింది ఐపీఎల్ ఆడటానికి తప్ప.. ఎవరితోనో తిట్లు తినడానికి కాదంటూ సీరియస్ కామెంట్స్ చేయడం విశేషం. ఫీల్డ్ లో విరాట్ లాగే దూకుడుగా ఉంటాడు నవీనుల్ హక్. గతంలో ఓసారి ఆఫ్ఘనిస్థాన్ తరఫున పాకిస్థాన్ తో ఆడుతున్న సమయంలోనూ అతడు ఇలాగే చేశాడు. దీంతో అప్పటి పాక్ కెప్టెన్ అఫ్రిది అతనికి క్లాస్ పీకాడు.
ఇక ఇప్పుడు విరాట్ లాంటి ప్లేయర్ తో గొడవకు దిగి మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే అసలు ఈ గొడవ ఎందుకు జరిగిందో మ్యాచ్ తర్వాత అతడు తన టీమ్ మేట్స్ కు వివరించినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది. లక్నో ఇన్నింగ్స్ 17వ ఓవర్లో సిరాజ్, నవీన్ మధ్య మాటల యుద్ధంతో ఈ గొడవ మొదలైంది. తర్వాత విరాట్ జోక్యం చేసుకొని నవీన్ ను ఏదో అన్నాడు. తర్వాత తన షూస్ కూడా అతనికి చూపించాడు.
మ్యాచ్ తర్వాత కూడా ఈ ఇద్దరి గొడవ కొనసాగడంతో గంభీర్ కూడా జోక్యం చేసుకున్నాడు. దీంతో ఆ గొడవ కాస్త విరాట్, గంభీర్ వైపు తిరిగింది. మ్యాచ్ తర్వాత ఈ గొడవపై నవీన్ స్పందించాడు. "ఎవరైనా నన్నేమైనా అంటే నేను వెనక్కి తగ్గను. చిన్నప్పటి నుంచీ నేనింతే. నాకు సహజంగా అలా వచ్చేస్తుంది. ఇక నుంచి అలా చేయను అని కూడా చెప్పను. ఎవరైనా ఏమైనా అంటే వెంటనే తిరిగి అనేస్తాను. అది నా డీఎన్ఏలోనే ఉంది" అని నవీన్ అనడం గమనార్హం.
అయినా నేనిక్కడికి ఐపీఎల్ ఆడటానికి వచ్చాను తప్ప.. ఎవరితోనో తిట్లు తినడానికి కాదు అని కూడా నవీన్ అన్నాడు. ఈ సందర్భంగా పాకిస్థాన్ తో మ్యాచ్ లో జరిగిన గొడవ గురించి కూడా చెప్పాడు. అయితే తాను ఫీల్డ్ బయట మాత్రం అందరితోనూ బాగుంటానని, జోకులేస్తానని చెప్పాడు. "ఒకసారి గ్రౌండ్ లోకి దిగితే మాత్రం చాలా సీరియస్ గా ఉంటాను. అది ఫ్రాంఛైజీ క్రికెట్ అయినా, దేశం తరఫున ఆడుతున్నా అంతే. ఎవరైనా ఏమైనా అంటే అస్సలు ఊరుకోను" అని నవీన్ అన్నాడు.
సంబంధిత కథనం