Kohli vs Gambhir: కోహ్లి కోసం గంభీర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు త్యాగం చేశాడన్న విషయం తెలుసా?-gambhir once sacrificed his man of the match award for kohli ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kohli Vs Gambhir: కోహ్లి కోసం గంభీర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు త్యాగం చేశాడన్న విషయం తెలుసా?

Kohli vs Gambhir: కోహ్లి కోసం గంభీర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు త్యాగం చేశాడన్న విషయం తెలుసా?

Hari Prasad S HT Telugu
May 02, 2023 04:26 PM IST

Kohli vs Gambhir: కోహ్లి కోసం గంభీర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు త్యాగం చేశాడన్న విషయం తెలుసా? తాజాగా ఐపీఎల్లో ఈ ఇద్దరి మధ్యా మరోసారి గొడవ జరిగిన నేపథ్యంలో ఈ పాత వార్త వైరల్ అవుతోంది.

విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్
విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ (PTI)

Kohli vs Gambhir: ఇప్పుడున్న పరిస్థితుల్లో విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ లను చూస్తే పాము, ముంగిస గుర్తుకు రావడం ఖాయం. ఈ ఇద్దరూ ఒకరికొకరు ఎదురు పడితే చాలు.. కత్తులు నూరుకుంటారు. 2013లో ఇదే ఐపీఎల్లో మొదలైన వీళ్ల గొడవ.. పదేళ్లయినా కొనసాగుతూనే ఉంది. అయితే ఇదే కోహ్లి కోసం ఒకప్పుడు గంభీర్ తన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు త్యాగం చేశాడన్న విషయం మీకు తెలుసా?

తాజాగా ఆర్సీబీ, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ లో కోహ్లి, గంభీర్ గొడవతో ఈ పాత వార్త మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పుడీ ఇద్దరి మధ్య ఈ స్థాయిలో విభేదాలు ఉన్నా.. విరాట్ టీమ్ లోకి వచ్చిన కొత్తలో గంభీర్ అతనికి సపోర్ట్ ఇచ్చాడు. అంతేకాదు 2009, డిసెంబర్ లో జరిగిన ఓ మ్యాచ్ లో తనకు వచ్చిన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గంభీర్.. కోహ్లికి ఇప్పించాడు.

ఆ మ్యాచ్ లోనే విరాట్ కోహ్లి తన తొలి అంతర్జాతీయ సెంచరీ చేశాడు. ఆ మ్యాచ్ డిసెంబర్ 24, 2009లో జరిగింది. కోహ్లి అప్పుడప్పుడే ఇండియన్ టీమ్ లో అడుగుపెట్టగా.. గంభీర్ అప్పటికే ఆరేళ్లుగా ఆడుతున్నాడు. తొలి సెంచరీ చేసిన యువ ప్లేయర్ ను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో గంభీర్ తనకు వచ్చిన అవార్డును అతనికి ఇప్పించాడు.

ఆ మ్యాచ్ లో కోహ్లి సెంచరీతో శ్రీలంకను 7 వికెట్లతో ఇండియా ఓడించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఆ మ్యాచ్ జరిగింది. 316 పరుగుల లక్ష్యాన్ని ఇండియా చేజ్ చేసింది. ఆ మ్యాచ్ లో సచిన్, సెహ్వాగ్ త్వరగానే ఔటయ్యారు. ఈ సమయంలో కోహ్లి, గంభీర్ కలిసి మూడో వికెట్ కు ఏకంగా 224 రన్స్ జోడించారు. గంభీర్ కేవలం 137 బంతుల్లోనే 150 రన్స్ చేశాడు.

మరోవైపు విరాట్ 114 బంతుల్లో 107 రన్స్ చేయడం విశేషం. అయితే గంభీర్ మెరుగైన ఇన్నింగ్స్ ఆడటంతో అతనికే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ప్రకటించారు. కానీ ఆ అవార్డు తొలి సెంచరీ చేసిన కోహ్లికి ఇవ్వడమే కరెక్ట్ అని భావించిన గంభీర్.. అతన్ని పిలిచి అవార్డు ఇప్పించాడు.

Whats_app_banner

సంబంధిత కథనం