Shikhar Dhawan HIV Test: ఎయిడ్స్ టెస్ట్ చేయించుకున్నా.. ధావన్ షాకింగ్ కామెంట్స్
27 March 2023, 21:54 IST
Shikhar Dhawan HIV Test: ఎయిడ్స్ టెస్ట్ చేయించుకున్నా అంటూ క్రికెటర్ శిఖర్ ధావన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇంతకీ అతడు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది?
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్
Shikhar Dhawan HIV Test: ఎయిడ్స్.. అసలు మందులే లేని ప్రాణాంతకమైన వ్యాధి. అసలు దాని పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. మరి అలాంటి భయంకరమైన వ్యాధికి సంబంధించిన టెస్ట్ తాను చేయించుకున్నట్లు టీమిండియా, పంజాబ్ కింగ్స్ క్రికెటర్ శిఖర్ ధావన్ చెప్పడం షాక్ కు గురి చేస్తోంది. తాను అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తాజాగా ఆజ్ తక్ లో వచ్చిన సీధీ బాత్ ప్రోగ్రామ్ లో వెల్లడించాడు.
ధావన్ గురించి తెలుసు కదా. అతని ఒంటి నిండా టాటూలే ఉంటాయి. ఎయిడ్స్ సురక్షితం కాని శృంగారంతోపాటు ఇలా టాటూలు వేయించుకున్నా సోకే ప్రమాదం ఉంది. టాటూలు వేయడానికి ఉపయోగించే సూదిని ఒక్కరికి కాకుండా ఎంతో మందికి వాడుతుంటారు. అలాంటి వాళ్లలో హెచ్ఐవీ సోకిన వాళ్లు కూడా ఉండే అవకాశం ఉంది. అలా వాళ్ల నుంచి సాధారణ వ్యక్తులకు కూడా అది సోకుతుంది.
ధావన్ కు కూడా ఒకసారి అలాంటి భయమే కలిగింది. అయితే అప్పుడు ధావన్ వయసు కేవలం 14-15 ఏళ్లు మాత్రమే. టీనేజీలో ఉన్నప్పటి నుంచే టాటూలను ఎంతో ఇష్టపడే ధావన్.. ఒకసారి తన కుటుంబానికి తెలియకుండా టాటూ వేయించుకున్నట్లు వెల్లడించాడు.
"నేను 14-15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మనాలీకి వెళ్లాను. నా కుటుంబ సభ్యులకు చెప్పకుండా వెనుక భాగంలో ఓ టాటూ వేయించుకున్నాను. చాలా రోజుల వరకు దానిని దాచి పెట్టాను. అయితే మూడు, నాలుగు నెలల తర్వాత మా నాన్నకు ఈ విషయం తెలిసింది. దీంతో ఆయన నన్ను కొట్టారు. టాటూ వేయించుకున్న తర్వాత నాకు భయం వేసింది. దాని కోసం వాడిన సూదిని ఎంత మంది కోసం వాడారో అన్న సందేహం కలిగింది. వెంటనే హెచ్ఐవీ టెస్ట్ చేయించుకున్నాను. అది ఇప్పటి వరకూ నెగటివ్ గానే వచ్చింది" అని ధావన్ నవ్వుతూ చెప్పాడు.
టాటూలు అంటే ధావన్ కుటుంబం అస్సలు అంగీకరించేది కాదు. ముఖ్యంగా అతని తండ్రి ఈ విషయంలో ధావన్ పై చేయి కూడా చేసుకున్నాడు. అయినా సరే ధావన్ మాత్రం టాటూలపై తనకున్న ప్రేమను వదులుకోలేదు. ఇక క్రికెట్ విషయానికి వస్తే రానున్న ఐపీఎల్ సీజన్ లో ధావన్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా బరిలోకి దిగనున్నాడు.