Shikhar Dhawan as Punjab Kings Captain: పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా శిఖర్‌ ధావన్.. మయాంక్‌ ఔట్‌-shikhar dhawan as punjab kings captain from next season ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Shikhar Dhawan As Punjab Kings Captain From Next Season

Shikhar Dhawan as Punjab Kings Captain: పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా శిఖర్‌ ధావన్.. మయాంక్‌ ఔట్‌

Hari Prasad S HT Telugu
Nov 02, 2022 10:03 PM IST

Shikhar Dhawan as Punjab Kings Captain: పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా శిఖర్‌ ధావన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. 2023 నుంచి మయాంక్‌ అగర్వాల్‌ స్థానంలో ధావన్‌కు కెప్టెన్సీ ఇవ్వాలని ఫ్రాంచైజీ బోర్డ్‌ నిర్ణయించింది.

పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీ చేపట్టనున్న శిఖర్ ధావన్
పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీ చేపట్టనున్న శిఖర్ ధావన్

Shikhar Dhawan as Punjab Kings Captain: ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ పంజాబ్‌ కింగ్స్‌కు మరో కొత్త కెప్టెన్‌ రానున్నాడు. 2023 నుంచి సీనియర్‌ బ్యాటర్‌ శిఖర్ ధావన్‌కు ఆ బాధ్యతలు అప్పగించాలని ఫ్రాంఛైజీ నిర్ణయించింది. ఈ విషయాన్ని బుధవారం (నవంబర్ 2) ట్విటర్ ద్వారా పంజాబ్ కింగ్స్ వెల్లడించింది. ఇప్పటికే ఆ టీమ్‌ కొత్త కోచ్‌గా ట్రెవర్‌ బేలిస్‌ను నియమించిన విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు

కెప్టెన్సీ బాధ్యతలను మయాంక్‌ అగర్వాల్‌ నుంచి శిఖర్‌ ధావన్‌కు అప్పగించడానికి బేలిస్‌ కూడా అంగీకరించాడు. 2022 సీజన్‌కు ముందే మయాంక్‌ను పంజాబ్‌ కింగ్స్ కెప్టెన్‌గా నియమించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఈ టీమ్‌ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ ఉండేవాడు. అయితే ఈ ఏడాది రాహుల్‌ లక్నో టీమ్‌కు వెళ్లిపోవడంతో మాయంక్‌, అర్ష్‌దీప్‌లను పంజాబ్‌ రిటేన్‌ చేసుకుంది.

ఆ తర్వాత వేలంలో ధావన్‌ను రూ.8.25 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పుడే కెప్టెన్సీని ధావన్‌కు ఇస్తారా లేక మయంక్‌కా అన్న చర్చ జరిగింది. చివరికి ఆ టీమ్‌ మయాంక్‌ వైపే మొగ్గు చూపింది. కానీ అతని కెప్టెన్సీలో ఈ సీజన్‌లో పంజాబ్‌ విఫలమైంది. 2022 సీజన్‌లో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. అటు మయాంక్‌ ఫామ్‌ కూడా దెబ్బతిన్నది. అతడు 13 మ్యాచ్‌లలో కేవలం 196 రన్స్‌ మాత్రమే చేశాడు.

అటు ధావన్‌ మాత్రం ప్రతి ఐపీఎల్‌ సీజన్‌కూ మెరుగవుతూ వస్తున్నాడు. ఈ మధ్యే అప్పుడప్పుడూ ఇండియన్ టీమ్‌ కెప్టెన్‌గా వస్తున్న అవకాశాలనూ సద్వినియోగం చేసుకుంటూ విజయాలు సాధించి పెడుతున్నాడు. దీంతో పంజాబ్‌ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతలను అతనికి అప్పగించాలని నిర్ణయించింది. 2016 నుంచి ఐపీఎల్‌లో ధావన్‌ నిలకడగా ఆడుతున్నాడు.

2022లో పంజాబ్‌ కింగ్స్‌ తరఫున ధావన్‌ 14 మ్యాచ్‌లలో 38 సగటుతో 460 రన్స్‌ చేశాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచీ ఈ మెగా లీగ్‌లో ఆడుతున్న ధావన్‌.. సీనియర్‌ మోస్ట్ ప్లేయర్స్‌లో ఒకడు. ఇక ఇప్పుడు న్యూజిలాండ్‌ వెళ్తున్న ఇండియన్‌ వన్డే టీమ్‌కు కూడా కెప్టెన్‌గా ఉండనున్నాడు. అయితే ఐపీఎల్‌లో ధావన్‌ కెప్టెన్సీ పెద్దగా విజయవంతం కాలేదు. అతడు ఇప్పటి వరకూ 10 మ్యాచ్‌లలో సన్‌రైజర్స్‌ను, ఒక మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ను లీడ్‌ చేయగా.. అందులో నాలుగు గెలిచి, ఏడు ఓడిపోయాడు.

మరోవైపు కెప్టెన్సీ కోల్పోయిన మయాంక్‌ను పంజాబ్‌ కింగ్స్‌ రిటేన్‌ చేసుకుంటుందా లేదా వదిలేస్తుందా అన్నది చూడాలి. ఫ్రాంఛైజీలకు ఈ నెల 15 వరకూ ప్లేయర్స్‌ను రిలీజ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం మయాంక్‌కు పంజాబ్ కింగ్స్ రూ.12 కోట్లు చెల్లిస్తోంది.

WhatsApp channel

టాపిక్