India tour of New Zealand: వన్డేలకు ధావన్.. టీ20లకు హార్దిక్.. రోహిత్, కోహ్లిలకు రెస్ట్
India tour of New Zealand: వన్డేలకు ధావన్.. టీ20లకు హార్దిక్ పాండ్యా కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. సీనియర్ బ్యాటర్లు రోహిత్, కోహ్లిలకు రెస్ట్ ఇచ్చారు. సోమవారం (అక్టోబర్ 31) న్యూజిలాండ్‌కు వెళ్లే టీమిండియా జట్లను సెలక్టర్లు ప్రకటించారు.
India tour of New Zealand: న్యూజిలాండ్ వెళ్లే ఇండియా టీ20, వన్డే టీమ్స్‌ను బీసీసీఐ సోమవారం (అక్టోబర్ 31) ప్రకటించింది. 16 మంది సభ్యులతో కూడిన టీ20 టీమ్‌కు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్‌లకు రెస్ట్ ఇచ్చారు. న్యూజిలాండ్‌లో మూడు టీ20ల సిరీస్ నవంబర్ 18 నుంచి ప్రారంభం కానుంది.
ఇక న్యూజిలాండ్‌తోనే మూడు వన్డేల సిరీస్ కూడా ఆడనుంది. 2020 తర్వాత టీమిండియా.. న్యూజిలాండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. టీ20 వరల్డ్‌కప్ ముగిసిన ఐదు రోజులకే ఈ టూర్ ప్రారంభం కానుంది. హార్దిక్ పాండ్యా ఈ ఏడాది ఐర్లాండ్‌లో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌లోనూ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అప్పుడు 2-0తో ఇండియా సిరీస్ గెలిచింది. అంతకుముందు ఐపీఎల్‌లోనూ గుజరాత్‌ను విజేతగా నిలిపాడు.
ఇక టీ20 టీమ్‌లో బుమ్రా, దినేష్ కార్తీక్‌లకు కూడా చోటు దక్కలేదు. ప్రస్తుతం వరల్డ్‌కప్ ఆడుతున్న టీమ్ నుంచి హార్దిక్‌తోపాటు పంత్, హుడా, సూర్యకుమార్, చహల్, హర్షల్, భువనేశ్వర్, అర్ష్‌దీప్‌లు చోటు దక్కించుకున్నారు. వీళ్లు కాకుండా శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, ఉమ్రాన్ మాలిక్, సంజూ శాంసన్‌లు కూడా న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు టీమ్‌లోకి వచ్చారు. నవంబర్ 18, 20, 22 తేదీల్లో మూడు టీ20లు జరుగుతాయి.
వన్డేలకు ధావన్‌కు కెప్టెన్సీ
ఇక 16 మంది సభ్యుల వన్డే టీమ్‌ను కూడా బీసీసీఐ ప్రకటించింది. న్యూజిలాండ్‌తో ఈ టీమ్ మూడు వన్డేలు ఆడనుంది. ఈ టీమ్‌కు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అతని కెప్టెన్సీలో ఈ ఏడాది వెస్టిండీస్, జింబాబ్వే, సౌతాఫ్రికాలపై ఇండియా వన్డే సిరీస్‌లు గెలిచిన విషయం తెలిసిందే. వన్డే సిరీస్ నవంబర్ 25 నుంచి ప్రారంభం కానుంది. నవంబర్ 25, 27, 30 తేదీల్లో ఆక్లాండ్, హామిల్టన్, క్రైస్ట్‌చర్చ్‌లలో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. వన్డేల్లో రిషబ్ పంత్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వన్డే సిరీస్ కోసం తొలిసారి పేస్‌బౌలర్ కుల్దీప్ సేన్‌కు అవకాశం దక్కింది.
న్యూజిలాండ్‌తో ఆడే టీ20 టీమ్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, చహల్, కుల్దీప్, సిరాజ్, హర్షల్, భువనేశ్వర్, అర్ష్‌దీప్, ఉమ్రాన్ మాలిక్.
న్యూజిలాండ్‌తో ఆడే వన్డే టీమ్: శిఖర్ ధావన్ (కెప్టెన్), పంత్ (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, హుడా, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్, సంజూ శాంసన్, చహల్, కుల్దీప్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ సేన్, అర్ష్‌దీప్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్.