తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Mumbai Vs Punjab Records: ఐపీఎల్ చరిత్రలోనే మూడో అత్యధిక చేజింగ్.. పంజాబ్‌తో మ్యాచ్‌లో రికార్డుల వర్షం

Mumbai vs Punjab Records: ఐపీఎల్ చరిత్రలోనే మూడో అత్యధిక చేజింగ్.. పంజాబ్‌తో మ్యాచ్‌లో రికార్డుల వర్షం

04 May 2023, 6:41 IST

google News
    • Mumbai vs Punjab Records: పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ రికార్డుల వర్షాన్ని కురిపించింది. వరుసగా రెండో సారి 200 కంటే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రోహిత్ సేన నిలిచింది. అంతేకాకుండా మూడో అత్యధిక లక్ష్య ఛేదనను నమోదు చేసింది.
పంజాబ్‌పై ముంబయి ఘనవిజయం
పంజాబ్‌పై ముంబయి ఘనవిజయం (AFP)

పంజాబ్‌పై ముంబయి ఘనవిజయం

Mumbai vs Punjab Records: పంజాబ్ కింగ్స్‌తో గురువారం నాడు జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పంజాబ్ నిర్దేశించిన 215 పరుగుల లక్ష్యాన్ని ముంబయి మరో 7 బంతులు మిగిలుండగానే దిగ్విజయంగా ఛేదించింది. రోహిత్ జట్టులో ఇషాన్ కిషన్(77), సూర్యకుమార్ యాదవ్(66) ఇద్దరూ అర్ధశతకాలతో చెలరేగి అద్భుత విజయాన్ని అందించారు. వీరి ధాటికి అంత పెద్ద లక్ష్యం కూడా చిన్నదైపోయింది. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలోనే మూడో అత్యధిక చేజింగ్‌గా ఇది నిలిచిపోయింది.

ఐపీఎల్‌లో అతిపెద్ద చేజింగ్ వచ్చి 2020లో నమోదైంది. రాజస్థాన్ రాయల్స్.. పంజాబ్ జట్టుపై 224 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా నమోదు చేసింది. అనంతరం 2021లో చెన్నై నిర్దేశించిన 219 పరుగుల లక్ష్యాన్ని ముంబయి చేజ్ చేసింది. 2008లో డెక్కన్ ఛార్జర్స్‌పై రాజస్థాన్ 215 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఇప్పుడు ముంబయి కూడా సంయుక్తంగా మూడో అత్యధిక లక్ష్యాన్ని చేజ్ చేసి సంయుక్తంగా రాజస్థాన్‌తో పాటు నిలిచింది.

ఈ మ్యాచ్‌లో నమోదైన కొన్ని అరుదైన రికార్డులు/గణాంకాలు..

- ఈ ఐపీఎల్‌లో 200 లేదా అంతకంటే ఎక్కువ లక్ష్యాన్ని ముంబయి వరుసగా రెండోసారి ఛేదించింది. తన గత మ్యాచ్‌లో రాజస్థాన్ నిర్దేశించిన 213 పరుగుల స్కోరును విజయవంతంగా చేజ్ చేసింది. ఫలితంగా టీ20 చరిత్రలో వరుస మ్యాచ్‌లో 200 కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేదించిన మూడో జట్టుగా ముంబయి అవతరించింది. అంతకంటే ముందు 2011లో ఆర్సీబీ, 2020-21 సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో కేరళ ఈ ఘనత సాధించాయి.

- ఐపీఎల్ 2023లో ఇప్పటి వరకు 200 కంటే ఎక్కువ లక్ష్యాన్ని 5 సార్లు విజయవంతంగా ఛేదించారు. టీ20 టోర్నీల్లో ఇదే అత్యధికం. 2017 ఐపీఎల్ సీజన్‌లోనూ 5 సార్లు అత్యధిక లక్ష్య ఛేదనలు నమోదయ్యాయి.

- పంజాబ్ కింగ్స్-ముంబయి ఇండియన్స్ జట్లు వరుసగా 4 సార్లు 200కి పైగా స్కోర్లు నమోదు చేశాయి. ఐపీఎల్‌లో వరుసగా అత్యధిక టోటల్స్ సాధించిన రికార్డును ఈ రెండు జట్లు సంయుక్తంగా కలిగి ఉన్నాయి. అంతకుముందు 2 సార్లు కంటే ఏ జట్టు కూడా వరుసగా 200 స్కోర్ సాధించలేదు.

- గత మూడు సీజన్లుగా ముంబయి ఇండియన్స్ బ్యాటర్లు వందకు పైగా భాగస్వామ్యాన్ని నమోదు చేయలేదు. కానీ ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ 116 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. చివరగా 2020లో చెన్నైపై ఇషాన్ కిషన్-క్వింటన్ డికాక్ 116 పరుగుల ఓపెనింగ్ పాట్నర్‌షిప్ నమోదు చేశారు.

- పంజాబ్ బౌలర్ అర్షదీప్ సింగ్ ఐపీఎల్ చరిత్రలోనే ఎక్కువ పరుగులిచ్చిన మూడో బౌలర్‌గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 3.5 ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు 66 పరుగులు సమర్పించుకున్నాడు.

పంజాబ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబయి 6 వికెట్ల తేడాతో గెలిచింది. 215 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో ఛేదించింది. మొత్తంగా 216 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ముంబయి బ్యాటర్లు ఇషాన్ కిషన్(77), సూర్యకుమార్ యాదవ్(66) రాణించి తమ జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. పంజాబ్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ 2 వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్, రిషి ధావన్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 213 పరుగులు చేసింది. లివింగ్ స్టోన్(82) అద్భుత అర్ధ సెంచరీతో చేలరేగగా.. జితేష్ శర్మ(49) ఆకట్టుకున్నాడు. ఫలితంగా ముంబయికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది పంజాబ్. ముంబయి బౌలర్లలో పియూష్ చావ్లా 2 వికెట్లు తీయగా.. అర్షద్ ఖాన్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

తదుపరి వ్యాసం