MS Dhoni Record: ధోనీ సూపర్ రికార్డు.. స్విట్జర్లాండ్‌లో ఆడుతున్నట్లుందన్న మిస్టర్ కూల్
08 January 2024, 18:59 IST
- MS Dhoni Record: ధోనీ సూపర్ రికార్డు క్రియేట్ చేశాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్విట్జర్లాండ్‌లో ఆడుతున్నట్లుందని మిస్టర్ కూల్ జోక్ చేశాడు. రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో ధోనీ ఎవరికీ సాధ్యం కాని రికార్డు అందుకున్నాడు.
ధోనీకి మెమొంటో అందజేస్తున్న శ్రీనివాసన్
MS Dhoni Record: ధోనీకి రికార్డులు కొత్త కాదు. చరిత్రను తిరగరాయడమూ అతనికి అలవాటే. అలాంటిదే ఐపీఎల్లో మరో కొత్త చరిత్రను అతడు క్రియేట్ చేశాడు. బుధవారం (ఏప్రిల్ 12) రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు 200వ మ్యాచ్ లో కెప్టెన్ గా అతడు వ్యవహరించాడు. ఐపీఎల్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రికార్డు ఇది.
ధోనీ తర్వాత రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్) 146 మ్యాచ్ లతో రెండోస్థానంలో ఉన్నాడు. ఈ రికార్డు మ్యాచ్ కు ముందు ధోనీని సీఎస్కే టీమ్ సన్మానించింది. ఆ టీమ్ ఓనర్ శ్రీనివాసన్.. ధోనీకి ఓ స్పెషల్ మెమొంటోను అందించాడు. ఈ రికార్డు మ్యాచ్ ను సొంతగడ్డపై ఆడుతుండటం దీనిని మరింత స్పెషల్ గా మార్చింది. ఇక టాస్ సందర్భంగా ఈ మ్యాచ్ గురించి మిస్టర్ కూల్ ఓ జోక్ కూడా చేశాడు.
చెపాక్ స్టేడియంలో చాలా వేడిగా ఉందని, అయితే తనకు మాత్రం ఇప్పుడు స్విట్జర్లాండ్ లో ఆడుతున్నట్లుందని ధోనీ అనడం విశేషం. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన అతడు ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ సందర్భంగా రవిశాస్త్రితో మాట్లాడుతూ.. సరదాగా ఈ కామెంట్స్ చేశాడు.
"మేము మొదట బౌలింగ్ చేస్తాం. పిచ్ కాస్త నెమ్మదిగా కనిపిస్తోంది. పైగా రాత్రి పూట మంచు కూడా కురుస్తుంది. రెండో ఇన్నింగ్స్ లో అది మాకు కలిసి రావచ్చు. ఇక కెప్టెన్ గా 200వ మ్యాచ్ ఆడుతుండటం చాలా బాగుంది. ఇక్కడి ప్రేక్షకులు అద్భుతం. ఈ పాత స్టేడియంలో చాలా వేడిగా, ఉక్కపోతగా ఉంటుంది. కానీ నాకు మాత్రం ఇప్పుడు స్విట్జర్లాండ్ లో ఆడుతున్నట్లుగా ఉంది. టీ20 క్రికెట్ చాలా మారిపోయింది" అని ధోనీ అన్నాడు.
41 ఏళ్ల ధోనీ ఐపీఎల్లో ఇప్పటి వరకూ 214 మ్యాచ్ లలో కెప్టెన్ గా ఉన్నాడు. అందులో 200 మ్యాచ్ లలో చెన్నైకి, 14 మ్యాచ్ లలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ కి సారథిగా ఉన్నాడు. ధోనీ 238 మ్యాచ్ లలో 5004 రన్స్ చేశాడు.