Ravi Shastri on Injuries: క్రికెట్ లో గాయాలు ఎలాంటి టీమ్ నైనా బలహీనం చేస్తాయి. టీమిండియా చాలా రోజులుగా ఈ గాయాల రుచి చూస్తూనే ఉంది. ముఖ్యంగా పేస్ బౌలర్లు తరచూ గాయాల పాలవుతూ కీలకమైన సిరీస్ లకు దూరమవుతున్నారు. దీపక్ చహర్ కూడా ఇలాగే తరచూ టీమ్ లోకి వస్తూ, వెంటనే గాయాల పాలవుతున్నాడు.
ప్రస్తుతం ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న అతడు.. ముంబైతో మ్యాచ్ లో గాయపడి రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ కు దూరం కానున్నాడు. దీంతో ఈ గాయాలపై మాజీ కోచ్ రవిశాస్త్రి తీవ్రంగా మండిపడ్డాడు. సీఎస్కేలో ఇప్పటికే కైల్ జేమీసన్, ముఖేష్ చౌదరి గాయాలతో దూరమయ్యారు. అయితే చహర్ తరచూ గాయాల పాలవడంపై శాస్త్రి అసహనం వ్యక్తం చేశాడు.
కొందరు క్రికెటర్లు నేషనల్ క్రికెట్ అకాడెమీ (ఎన్సీఏ)కు శాశ్వత సభ్యులు అయిపోయారని సెటైర్ వేయడం విశేషం. "కొందరు ప్లేయర్స్ ఎన్సీఏలో పర్మనెంట్ సభ్యులు అవుతున్నారు. త్వరలోనే అక్కడ వారికి నివాస అనుమతి కూడా వస్తుందేమో.
ఎప్పుడు కావాలంటే అప్పుడు అక్కడికి వెళ్లొచ్చు. ఇది సరైంది కాదు. ఇలా పదే పదే గాయపడటానికి మరీ అంతగా క్రికెట్ ఆడటం లేదు. వరుసగా నాలుగు మ్యాచ్ లు ఆడలేకపోతే ఎలా. ఎన్సీఏకు ఎందుకు వెళ్తున్నారు? వస్తున్నారు.. మూడు మ్యాచ్ లు ఆడి మళ్లీ అక్కడికి వెళ్తున్నారు" అని రవిశాస్త్రి అన్నాడు.
కీలకమైన ఆటగాళ్లు ఇలా తరచూ గాయాలపాలవుతుంటే ఆయా జట్లకు, కెప్టెన్లకు, బీసీసీఐకి చిరాకు తెప్పిస్తుందని శాస్త్రి చెప్పాడు. "ఇది టీమ్ కే కాదు ప్లేయర్స్, కెప్టెన్లు, బీసీసీఐ, ఫ్రాంఛైజీలకు చికాకు తెప్పిస్తుంది. తీవ్రమైన గాయం అంటే అర్థం చేసుకోవచ్చు.
కానీ ప్రతి నాలుగో మ్యాచ్ లో ఓ ప్లేయర్ కాలి పిక్కల్లోనో, గజ్జల్లోనో గాయపడితే అసలు ఏం జరుగుతుందో ఆలోచించాల్సిందే. కొందరు ఇతర క్రికెట్ ఏదీ ఆడరు. కేవలం నాలుగు ఓవర్లు, మూడు గంటల్లోనే మ్యాచ్ ముగుస్తుంది. ఇది మరీ దారుణంగా ఉంది" అని రవిశాస్త్రి అసహనం వ్యక్తం చేశాడు.
సంబంధిత కథనం