MI vs CSK: సొంతగడ్డపై ఘోరంగా ఓడిన ముంబయి.. చెలరేగిన రహానే.. చెన్నై అద్భుత విజయం
MI vs CSK: వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 158 పరుగుల లక్ష్యాన్ని మరో 11 బంతులు మిగిలుండగానే ఛేదించింది. రహానే అర్ధశతకంతో అదరగొట్టాడు.
MI vs CSK: ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. 158 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన చెన్నై కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మరో 11 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని పూర్తి చేసింది. చెన్నై బ్యాటర్లలో అంజిక్య రహానే(61) అద్భుత అర్ధ శతకంతో చెలరేగగా.. రుతురాజ్ గైక్వాడ్(40) మరోసారి ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. శివమ్ దూబే(28), అంబటి రాయుడు(20) రాణించారు. ఓ మోస్తరు లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది చెన్నై. ముంబయి బౌలర్లలో జేసన్ బెహ్రెండార్ఫ్, పీయూష్ చావ్లా, కుమార్ కార్తికేయ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
158 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన చెన్నై జట్టుకు శుభారంభమేమి దక్కలేదు. పరుగులేమి రాకముందే ఓపెనర్ డేవాన్ కాన్వే(0) వికెట్ కోల్పోయింది సీఎస్‌కే. అయితే తర్వాత క్రీజులోకి వచ్చిన అంజిక్య రహానే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. చాలా రోజుల తర్వాత అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. వచ్చి రావడమే పరుగుల వర్షం పారించాడు. ముఖ్యంగా నాలుగో ఓవర్ వేసిన అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్ బాది ఆ ఓవర్‌లో 23 పరుగులు పిండుకున్నాడు. అనంతరం కూడా అదే దూకుడుగా ఆడాడు. రహానే 19 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి.. ఈ సీజన్‌లో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ చేసిన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
రహానే ధాటికి పవర్ ప్లే ఆరు ఓవర్లలోనే 68 పరుగులు పిండుకుంది. అర్ధ సెంచరీ పూర్తయిన తర్వాత కూడా రహానే అదే దూకుడు కొనసాగించాడు. అయితే వేగంగా ఆడే ప్రయత్నంలో పియూష్ చావ్లా బౌలింగ్ బౌండరీలో లైన్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మొత్తంగా 27 బంతుల్లో 61 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. రహానే ఔటైన తర్వాత రుతురాజ్ గైక్వాడ్.. దూబే సాయంతో ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు. దూబే భారీ షాట్లు ఆడగా.. రుతురాజ్ నిలకడగా రాణించాడు. శివమ్ దూబేను కుమార కార్తికేయ బౌల్డ్ చేయగా.. ఆ తర్వాత క్రీజులోకి అంబటి రాయుడు వచ్చాడు.
మరోపక్క రుతురాజ్ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీ కొడుతూ రాణించాడు. మొదట్లో రాయుడు నిదానంగా ఆడగా.. తర్వాత గేరు మార్చి వేగాన్ని అందుకున్నాడు. చివర్లో మ్యాచ్‌ను త్వరగా ముగించేసి జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై కేవలం 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా ముంబయి వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకోగా.. చెన్నై వరుగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్(32), టిమ్ డేవిడ్(31) మాత్రమే అత్యధిక స్కోర్లు చేశారు. మిగిలినవారంతా విఫలం కావడంతో ముంబయి స్వల్ప స్కోరునే చేసింది. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా 3 వికెట్లతో విజృంభించగా.. తుషార్ దేశ్‌పాండే, మిషెల్ సాంట్నర్ చెరో రెండు వికెట్లు తీశారు.