MI VS CSK IPL 2023: చెలరేగిన చెన్నై.. ముంబయి ఓ మోస్తరు స్కోరుకే పరిమితం
MI VS CSK IPL 2023: వాంఖడే వేదికగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే, జడేజా చెరో 3 వికెట్లతో రాణించారు.
MI VS CSK IPL 2023: చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబయి బ్యాటర్లు చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించకపోవడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్(32), టిమ్ డేవిడ్(31) మాత్రమే అత్యధిక స్కోర్లు చేశారు. మిగిలినవారంతా విఫలం కావడంతో ముంబయి స్వల్ప స్కోరునే చేసింది. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా 3 వికెట్లతో విజృంభించగా.. తుషార్ దేశ్‌పాండే, మిషెల్ సాంట్నర్ చెరో రెండు వికెట్లు తీశారు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇండియన్స్‌కు శుభారంభమేమి దక్కలేదు. వేగంగా ఆడే ప్రయత్నంలో రోహిత్ శర్మ(21) నాలుగో ఓవర్లోనే తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. అనంతరం మరో ఓపెనర్ ఇషాన్ కిషన్(32), కేమరూన్ గ్రీన్(12) కాసేపు దూకుడుగా ఆడారు. దీంతో మొదటి ఆరు ఓవర్లలోనే స్కోరు 60 పరుగులకు చేరింది. ఇంక అప్పటి నుంచి ముంబయి కష్టాలు మొదలయ్యాయి. చెన్నై బౌలర్లు వరుస పెట్టి వికెట్లు తీసి రోహిత్ సేనను ఇబ్బంది పెట్టారు.
ముందుగా జోరు మీదున్న ఇషాన్ కిషన్‌ను జడేజా ఔట్ చేయగా.. ఆ కాసేపటికే సూర్యకుమార్ యాదవ్‌ను ఒక్క పరుగుకే పెవిలియన్ చేర్చాడు సాంట్నర్. ఆ తర్వాత ఓవర్లోనే కేమరూన్ గ్రీన్‌ను జడేజా క్యాచ్ అవుట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లో అర్షద్ ఖాన్‌ను(2) సాంట్నర్ ఎల్బీగా వెనక్కి పంపాడు. ఇలా ముంబయి బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. కాసేపు తిలక్ వర్మ(22) నిలకడగా రాణించినప్పటికీ అతడిని కూడా జడేజా ఔట్ చేశాడు. దీంతో 102 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది ముంబయి.
చివర్లో టిమ్ డేవిడ్(31) దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. 2 సిక్సర్లు, ఓ ఫోర్‌తో ధాటిగా ఆడాడు. అయితే అతడిని కూడా ఎక్కువ సేపు క్రీజులో ఉంచలేదు చెన్నై బౌలర్లు. అతడిని తుషార్ పెవిలియన్ చేర్చాడు. ఆఖరు ఓవర్లో హృతిక్ షోకీన్(18) మూడు ఫోర్లు కొట్టి ముంబయి స్కోరు 150 దాటేలా చేశాడు. ఆ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. దీంతో ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.