Jonty Rhodes on Ravindra Jadeja: జడేజానే బెస్ట్ ఫీల్డర్.. జాంటీ రోడ్స్ తేల్చేశాడు
Jonty Rhodes on Ravindra Jadeja: జడేజానే బెస్ట్ ఫీల్డర్ అని జాంటీ రోడ్స్ తేల్చేశాడు. అతనికి అసలు పోటీయే లేదని ఈ సౌతాఫ్రికా లెజెండరీ ప్లేయర్ అనడం విశేషం.
Jonty Rhodes on Ravindra Jadeja: గల్లీ క్రికెట్ నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ వరకు ఎవరైనా మెరుపు ఫీల్డింగ్ చేసారంటే అతన్ని జాంటీ రోడ్స్ తో పోలుస్తాం. క్రికెట్ లో రోడ్స్ రేంజ్ అది. ఫీల్డింగ్ ఇలా కూడా చేస్తారా అన్నట్లుగా ఫీల్డ్ లో మెరుపు వేగంతో కదలడం రోడ్స్ కే చెల్లింది. అతనికి ముందు, అతని తర్వాత ఆ స్థాయి ఫీల్డర్ ను క్రికెట్ చూడలేదంటే అతిశయోక్తి కాదు.
అయితే అలాంటి ఫీల్డర్ కూడా ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో రవీంద్ర జడేజాను మించిన ఫీల్డర్ లేడని అనడం విశేషం. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన రోడ్స్.. ఐపీఎల్ వచ్చిన తర్వాతే ఫీల్డింగ్ పై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారని అన్నాడు. ప్రస్తుతం జాంటీ రోడ్స్ లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ ఫీల్డింగ్ కోచ్ గా ఉన్నాడు.
"ప్రస్తుతం ఒకే ఒక్కడు ఉన్నాడు. అతడు రవీంద్ర జడేజా. ముఖ్యంగా టీ20 క్రికెట్ లో. ఐపీఎల్ ప్రారంభమైన తర్వాతే అందరూ ఫీల్డింగ్ పై దృష్టి సారిస్తున్నారు" అని రోడ్స అన్నాడు. ప్రస్తుతం అన్ని జట్లు కూడా ముగ్గురు, నలుగురిపై ఆధారపడకుండా ఒక మంచి ఫీల్డింగ్ టీమ్ గా ఉండటానికి ప్రయత్నిస్తున్నాయని రోడ్స్ అభిప్రాయపడ్డాడు.
"ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత ఫీల్డింగ్ మెరుగైంది. 2008 నుంచి గత 12-13 ఏళ్లు అద్భుతంగా సాగాయి. అంతకుముందు కూడా ఫీల్డింగ్ గురించి చర్చ వచ్చినా.. ముగ్గురు, నలుగురు ఫీల్డర్లే ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు ఓ టీమ్ గా ఫీల్డింగ్ మెరుగైంది. క్రికెట్ లో ఫీల్డింగ్ ఇప్పుడు ముఖ్య భాగం" అని రోడ్స్ అన్నాడు.
డగౌట్స్ లో మరింత మంది ఫీల్డింగ్ కోచ్ లు ఉండాల్సిన సమయం వచ్చిందని రోడ్స్ అభిప్రాయపడ్డాడు. "మరింత మంది కోచ్ లు కావాలని అనుకుంటున్నాను. నేను ఏదైనా అకాడెమీకి లేదంటే రాష్ట్రానికి వెళ్లినప్పుడు ఓ క్యాంప్ లో నేను మూడు, నాలుగు రోజులు ప్లేయర్స్ ను మోటివేట్ చేస్తాను. వాళ్లు కూడా ఉత్సాహంగా ఉంటారు. కానీ రెండు వారాల తర్వాత వాళ్లు అవన్నీ మరచిపోతారు. క్రికెట్ ను రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటేనే పర్ఫెక్షన్ వస్తుంది" అని రోడ్స్ స్పష్టం చేశాడు.
సంబంధిత కథనం