Mohammed Siraj: లాక్‌డౌన్ సిరాజ్‌కు బాగా కలిసొచ్చిందట.. ఎందుకో చెప్పిన స్టార్ బౌలర్
20 April 2023, 21:02 IST
- Mohammed Siraj: లాక్‌డౌన్ సిరాజ్‌కు బాగా కలిసొచ్చిందట.. ఎందుకో చెప్పాడు ఈ స్టార్ బౌలర్. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో ఆర్సీబీని గెలిపించిన తర్వాత సిరాజ్ ఈ కామెంట్స్ చేశాడు.
మహ్మద్ సిరాజ్
Mohammed Siraj: కొవిడ్ లాక్‌డౌన్ ఎంతో మందిని ఎన్నో ఇబ్బందులు పెట్టింది. అయితే అదే లాక్‌డౌన్ కొంతమందికి కలిసొచ్చింది. ఆ కలిసొచ్చిన వాళ్లలో పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కూడా ఒకడు. ఐపీఎల్ 2023లో పంజాబ్ కింగ్స్ పై 4 వికెట్లు తీసి ఆర్సీబీని గెలిపించిన తర్వాత సిరాజ్ మాట్లాడాడు. తనకు లాక్‌డౌన్ ఎంతగానో సాయం చేసిందని చెప్పాడు.
మ్యాచ్ తర్వాత ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న సిరాజ్.. లాక్‌డౌన్ సమయంలో తాను పడిన కష్టానికి ఇప్పుడు తగిన ఫలితం దక్కుతోందని అన్నాడు. లాక్‌డౌన్ సమయంలో తాను ఫిట్‌నెస్, బౌలింగ్ పై బాగా దృష్టి సారించినట్లు చెప్పాడు. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో సిరాజ్ 4 ఓవర్లలో కేవలం 21 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు.
"లాక్‌డౌన్ నాకు ఎంతో ముఖ్యమైనదని చెబుతాను. ఎందుకంటే అంతకంటే ముందు నా బౌలింగ్ లో సులువుగా బౌండరీలు బాదేవాళ్లు. నేను నా ప్లాన్స్, ఫిట్‌నెస్, బౌలింగ్ పై పని చేశాను. ఇప్పుడు దాని తాలూకు ఫలితాలు కనిపిస్తున్నాయి" అని సిరాజ్ అన్నాడు. పంజాబ్ తో మ్యాచ్ లో ఆర్సీబీ 24 పరుగుల తేడాతో గెలిచింది. డుప్లెస్సి, కోహ్లి హాఫ్ సెంచరీలు చేశారు.
అయితే తర్వాత చేజింగ్ లో పంజాబ్ ను సిరాజ్ కట్టడి చేశాడు. ఈ మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీయడంతోపాటు ఓ డైరెక్ట్ త్రోతో కీలకమైన సమయంలో హర్‌ప్రీత్ సింగ్ ను రనౌట్ చేశాడు. టీమ్ ను గెలిపించడంలో తానెప్పుడూ తన వంతు పాత్ర పోషించినట్లు సిరాజ్ చెప్పాడు. తాను మంచి ఫీల్డర్ నని, అప్పుడప్పుడూ మిస్ ఫీల్డ్స్ అవుతుంటాయని అన్నాడు.