PBKS vs RCB: టాప్ 5లోకి దూసుకెళ్లిన ఆర్సీబీ.. విరాట్ కోహ్లికి రికార్డు గెలుపు
PBKS vs RCB: టాప్ 5లోకి దూసుకెళ్లింది ఆర్సీబీ. మరోవైపు విరాట్ కోహ్లి కెప్టెన్ గా రికార్డు గెలుపు అందుకున్నాడు. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో ఆర్సీబీ 24 పరుగులతో ఘన విజయం సాధించింది.
PBKS vs RCB: ఐపీఎల్లో ఆర్సీబీ మరో విజయం సాధించింది. గురువారం (ఏప్రిల్ 20) పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆ టీమ్ 24 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ లో డుప్లెస్సి బదులు విరాట్ కోహ్లి కెప్టెన్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో అతడు కెప్టెన్ గానూ కొన్ని రికార్డులను సొంతం చేసుకున్నాడు.
గాయంతో డుప్లెస్సి కేవలం బ్యాటింగ్ కు మాత్రమే పరిమితం కాగా.. కోహ్లికి మరోసారి కెప్టెన్సీ అవకాశం దక్కింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసి 4 వికెట్లకు 174 రన్స్ చేసింది. 175 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 150 పరుగులు మాత్రమే చేసింది. 24 పరుగులతో గెలిచిన ఆర్సీబీ పాయింట్ల టేబుల్లో ఐదో స్థానానికి దూసుకెళ్లింది. సిరాజ్ 4 వికెట్లతో ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఇక ఈ మ్యాచ్ లో డుప్లెస్సితో కలిసి విరాట్ పంజాబ్ బౌలర్లతో ఆడుకున్నాడు. ఈ ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేశారు. కోహ్లి 47 బంతుల్లో 59 రన్స్ చేశాడు. ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున పంజాబ్ పై రెండో అత్యధిక పరుగులు రికార్డును కోహ్లి అందుకున్నాడు. ఇక ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్ గా 6500 పరుగులు చేసిన తొలి ప్లేయర్ గా కూడా విరాట్ రికార్డు క్రియేట్ చేశాడు.
విరాట్ 186 ఇన్నింగ్స్ లో ఈ ఘనత అందుకున్నాడు. ఇక ఐపీఎల్లో 600 ఫోర్లు బాదిన మూడో బ్యాటర్ గా కోహ్లి నిలిచాడు. ఈ లిస్టులో ధావన్ 730 ఫోర్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. వార్నర్ 608 ఫోర్లు కొట్టాడు. ఈ ఓటమితో పంజాబ్ కింగ్స్ ఏడోస్థానానికి పడిపోయింది. కెప్టెన్ శిఖర్ ధావన్ ఈ మ్యాచ్ కు కూడా అందుబాటులో లేకపోవడంతో పంజాబ్ కు ఓటమి తప్పలేదు.
ఇక ఐపీఎల్ 2023 ఆరెంజ్ క్యాప్ లిస్టులో విరాట్ రెండో స్థానానికి వెళ్లాడు. ఈ సీజన్ లో 4 హాఫ్ సెంచరీలు సహా విరాట్ 279 పరుగులు చేశాడు. ఈ లిస్టులో 343 పరుగులతో డుప్లెస్సి టాప్ లోకి దూసుకెళ్లాడు.
సంబంధిత కథనం