IPL trophy in Tirupathi: ఐపీఎల్ ట్రోఫీకి టీటీడీ దేవస్థానంలో ప్రత్యేక పూజలు.. వీడియో వైరల్
30 May 2023, 19:52 IST
- IPL trophy in Tirupathi: ఐపీఎల్ ట్రోఫీకి టీటీడీ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఈ ట్రోఫీని దేవస్థానానికి తీసుకెళ్లారు.
చెన్నైలోని టీటీడీ దేవస్థానంలో ఐపీఎల్ ట్రోఫీకి ప్రత్యేక పూజలు
IPL trophy in Tirupathi: ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత దానిని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం చెన్నైలోని త్యాగరాయ నగర్ లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి తీసుకెళ్లారు. అక్కడ ట్రోఫీకి ప్రత్యేక పూజలు నిర్వహించడం విశేషం. సోమవారం (మే 29) జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటన్స్ ను చిత్తు చేసి ఐదోసారి చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత మంగళవారం (మే 30) తెల్లవారుఝామున సీఎస్కే టీమ్ చెన్నై చేరుకుంది. అక్కడ ట్రోఫీతో పాటు జట్టు విజయోత్సవాల్లో పాల్గొంది. ఆ తర్వాత ట్రోఫీని చెన్నైలోని త్యాగరాయ నగర్ లో ఉన్న టీటీడీ దేవస్థానానికి తీసుకెళ్లారు. అక్కడి వేద పండితులు శ్రీవారి సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
సీఎస్కే యాజమాన్యం ట్రోఫీని దేవస్థానానికి తీసుకురావడం అందులో చూడొచ్చు. ట్రోఫీకి పూజలు నిర్వహించిన తర్వాత దానిని ఇండియా సిమెంట్స్ వైస్ ఛైర్మన్ శ్రీనివాసన్ కు పూజారులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి సత్కరించారు.
ఐపీఎల్ ట్రోఫీని సీఎస్కే రికార్డు స్థాయిలో ఐదోసారి గెలిచిన విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్ కూడా ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. ఆదివారం జరగాల్సిన ఫైనల్ వర్షం కారణంగా సోమవారానికి వాయిదా పడగా.. రిజర్వ్ డే రోజు కూడా వర్షం అంతరాయం కలిగించింది. చివరికి సీఎస్కే చేజింగ్ ను 15 ఓవర్లకు కుదించగా.. చివరి బంతి జడేజా ఫోర్ కొట్టి టీమ్ ను గెలిపించాడు.