తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sreesanth On Rinku Singh : భారత క్రికెట్‌కు అద్భుతమైన ఆయుధం రింకూ సింగ్‌.. శ్రీశాంత్‌ ప్రశంసలు

Sreesanth On Rinku Singh : భారత క్రికెట్‌కు అద్భుతమైన ఆయుధం రింకూ సింగ్‌.. శ్రీశాంత్‌ ప్రశంసలు

Anand Sai HT Telugu

21 May 2023, 10:09 IST

google News
    • Rinku Singh : మే 20న లక్నో వర్సెస్ కోల్‌కతా మ్యాచ్ జరిగింది. ఇందులో లక్నో గెలిచింది. అయితే కోల్‌కతా ఆటగాడు రింకూ సింగ్ ప్రదర్శన మాత్రం సూపర్. ఎక్కడో ఉన్న మ్యాచ్ ను ఒక్క పరుగుతో ఓడిపోయేవరకూ తీసుకొచ్చాడు. ఇప్పుడు అతడిపై ప్రశంసలు కురుస్తున్నాయి.
రింకూ సింగ్
రింకూ సింగ్ (twitter)

రింకూ సింగ్

మే 20 శనివారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్(LSG Vs KKR) స్వల్ప ఓటమిని చవిచూసింది. లక్నో సూపర్‌జెయింట్స్‌ ఇచ్చిన 177 పరుగుల లక్ష్యంతో కోల్‌కతా నైట్ రైడర్స్ బరిలోకి దిగింది. కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించింది.

ఈ మ్యాచ్ లో ఓ దశలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు భారీ విజయాన్ని కోల్‌కతా అందజేసే సూచన కనిపించింది. అయితే కోల్‌కతా నైట్ రైడర్స్ లోయర్ ఆర్డర్ ప్లేయర్ రింకూ సింగ్(Rinku Singh) ఒంటరి పోరాటం కారణంగా ఎల్‌ఎస్‌జీ(LSG) ఓటమి ప్రమాదంలో పడింది. రింకూ సింగ్ మ్యాచ్‌ను దాదాపు తనవైపు తిప్పుకొన్నాడు. కానీ చివరికి LSG కేవలం ఒక పరుగు తేడాతో గెలిచింది.

కోల్‌కతా నైట్ రైడర్స్ విజయానికి చివరి రెండు ఓవర్లలో కేవలం 40 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. ఈ సమయంలో రింకూ సింగ్ ప్రదర్శన టోర్నీ అత్యుత్తమ ఇన్నింగ్స్‌లో ఒకటి. కేకేఆర్(KKR) దాదాపు విజయానికి చేరువైంది. అయితే గెలుపు గీతను దాటే సమయంలో ఎదురుదెబ్బ తగిలింది. ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది కోల్‌కతా. ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్ అద్భుత ప్రదర్శనపై మాజీ క్రికెటర్ శ్రీశాంత్(Sreesanth) మాట్లాడుతూ ప్రశంసలు కురిపించాడు.

రింకూ సింగ్ భారత క్రికెట్‌కు అద్భుతమైన ఆయుధంగా నిలుస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు శ్రీశాంత్. 'మనకు మంచి క్రికెటర్, ఫినిషర్ లభించాడు. కేవలం సిక్సర్లు కొట్టడమే కాదు. రింకూ ఇన్నింగ్స్‌ను నిర్మించి తన అవకాశం కోసం ఎదురుచూసే అద్భుతమైన ఆటగాడు.' అని శ్రీశాంత్ అన్నాడు.

టోర్నీ మొత్తం ఆడిన రింకూ సింగ్ 14 మ్యాచ్‌ల్లో 474 పరుగులు చేశాడు. అతని సగటు 59.25. కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున రింకూ సింగ్ 150 శాతం స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. అలాగే కొన్ని మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. 'ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్ ఒక్క పరుగు తేడాతో వెనుదిరిగాడు.. అతని ప్రదర్శన కేవలం ఒక్క మ్యాచ్‌కే పరిమితం కాలేదు.. నిలకడగా రాణించాడు.' అని శ్రీశాంత్ ప్రశంసించాడు.

తదుపరి వ్యాసం